Coronavirus: భారత్‌లో ప్రమాదఘంటికలు మోగిస్తోన్న కరోనా
Coronavirus: వారం రోజుల్లో భారీగా కేసుల పెరుగుదల
Coronavirus: దేశవ్యాప్తంగా కరోనా ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వరుసగా పెరుగుతున్న కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. 18 రోజులుగా దేశంలో కరోనా కేసులు పెరుగుతూ వస్తుండగా గత వారంలో భారీ పెరుగుదల కనిపించింది. మునుపటి వారం కంటే ఈ వారంలో లక్షా 30 వేల కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. పాటివివ్ కేసులతో పాటు మరణాలు కూడా అదే రేంజ్‌లో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 22 నుంచి 28 వరకు దేశంలో 3 లక్షల 90 వేల మంది కొవిడ్ బారిన పడ్డారు. 18 వందల 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిన్న దేశవ్యాప్తంగా 62 వేల 714 మంది కోవిడ్ బారిన పడగా.. దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 20 లక్షలకు చేరువయ్యాయి. నిన్న 312 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఒకే రోజు మరణాల్లో ఇదే అత్యధికం. మరణాల సంఖ్య లక్షా 61 వేల 552కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో నాలుగు లక్షల 86 వేల యాక్టివ్ కేసులున్నాయి.
దేశవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి వస్తున్నవే అధికం. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు 45 మందికి కరోనా పాజిటివ్ వస్తే, గాంధీ నగర్ ఐఐటీలో 25 మంది కరోనా బారినపడడం కలకలాన్ని రేపుతోంది.
బెంగళూరులో చిన్నారులకి కూడా కరోనా సోకుతూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు పదేళ్ల లోపు వయసున్న పిల్లలు 470 మందికిపైగా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. ఇక ఢిల్లీలోనూ భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు విధిస్తోంది. గతంలో పెళ్లిళ్లు, వేడుకలు, అంత్యక్రియలకు 200 మంది కంటే ఎక్కువ మంది హాజరుకావొద్దని ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ ఆదేశాలు జారీ చేసింది.