Delhi: భారత్‌లో క్రమంగా పెరుగుతోన్న కరోనా
Delhi: కొవిడ్ కాస్త తగ్గిందని తేరుకుంటున్నసమయంలో వైరస్ తన ఉనికిని చాటుతోంది.
Delhi: భారత్‌లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ కాస్త తగ్గిందని తేరుకుంటున్న సమయంలో వైరస్ ఉనికిని చాటుతోంది. కొత్తగా కొవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గడిచిన రోజుతో పోల్చితే కేసుల సంఖ్య కాస్త పెరిగింది. మంగళవారం 8.08 లక్షల పరీక్షలు చేయగా.. 13,742 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,30,176కి చేరింది. కొత్తగా 14,037మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,07,26,702కు చేరి.. రికవరీ రేటు 97.25శాతంగా చేరింది.
ఇక మరణాల విషయానికి వస్తే గడిచిన 24 గంటల్లో 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మహమ్మారి వెలుగులోకి వచ్చిన నాటి నుంచి దేశవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,56,567కి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1,46,907 తగ్గింది. ఇక మరణాల రేటు 1.42 శాతంగా కొనసాగుతోంది.మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సిన్ ను మంగళవారం నాటికి వారి సంఖ్య 1,21,65,598కి చేరింది.
తెలంగాణ లో క్రమంగా పెరుగుతున్న కరోనా
మరో వైపు తెలంగాణ లో కూడా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వారం క్రితం వరకు కరోనా పరీక్షల్లో ఒకటి, రెండు పాజిటివ్‌లు వచ్చేవి. వారం రోజుల నుంచి 22-35 మంది వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఫీవర్ ఆస్పత్రిలో వారం రోజుల క్రితం 56 మందికి యాంటిజన్ పరీక్షలు నిర్వహించగా పది మందికి కరోనా నిర్ధారణ కాగా, మంగళవారం 65 మందికి టెస్ట్ చేస్తే 15 మందిలో వైరస్ ఉన్నట్లు తేలింది. ఇక, కింగ్ కోఠి ఆస్పత్రిలో ప్రస్తుతం 57 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. గాంధీ ఆస్పత్రిలో వారం క్రితం 39 మందిలోపు చికిత్స పొందగా, ప్రస్తుతం 57 మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 3-5 కేసులు నమోదు అవుతుండగా, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఓపీలోనే చాలా మంది వైద్యం చేయించుకుంటున్నట్లు సమాచారం. కాగా.. ప్రస్తుతం ఎండ, చలి వాతావరణ సమయంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్‌ఖాన్ తెలిపారు. మునుపటి కరోనా వైరస్ ఒకరి నుంచి పది మందికి వస్తే, కొత్త స్ట్రెయిన్ ఒకరి నుంచి వంద మందికి విస్తరించే అవకాశం వుంటుందని వారు తెలిపారు.