పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌కు షాక్‌.. యూనిర్సిటీలకు చాన్సలర్‌గా సీఎం మమతబెనర్జీ

చాన్సలర్‌గా సీఎం మమతా బెనర్జీని నియమిస్తూ.. ప్రతిపాదనలు చేసిన బెంగాల్‌ కేబినెట్

Update: 2022-06-06 10:50 GMT

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌కు షాక్‌.. యూనిర్సిటీలకు చాన్సలర్‌గా సీఎం మమతబెనర్జీ

Mamata Banerjee Vs Jagdeep Dhankhar: పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ వర్సెస్‌ సీఎం వివాదం మరింత ముదురుతోంది. గవర్నర్‌ జగదీప్ ధన్‌ఖర్‌కు మమతా బెనర్జీ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. వర్సిటీల చాన్సలర్‌గా గవర్నర్‌ను తొలగిస్తూ బెంగాల్‌ కేబినెట్‌ ప్రతిపాదనలు చేసింది. కొత్త చాన్సలర్‌గా సీఎం మమతా బెనర్జీని నియమించింది. ప్రవేటు యూనివర్సిటీల్లోనూ విజిటర్‌ హోదాను కూడా గవర్నర్‌కు లేకుండా చేసింది. విజిటర్‌ హోదాను రాష్ట్ర విద్యాశాఖ మంత్రికి కేటాయించింది. ఇక బెంగాల్‌లోని వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలకు కూడా మమతనే ఛాన్సలర్‌గా ఉంటారని క్యాబినెట్‌ తీర్మానించింది. తాజా ప్రతిపాదనలను జూన్‌ 1న జరిగే వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.

గవర్నర్ల తీరుపై బీజేపీయేతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ వర్సెస్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్ మధ్య తీవ్ర మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణలోనూ గవర్నర్‌ తమిళిసైతో ప్రభుత్వానికి మధ్య వివాదం రేగుతోంది. తమిళనాడులోనూ గవర్నర్‌ తీరుపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్శిటీల్లో వైస్‌ చాన్సలర్‌ నియామకం విషయంలో గవర్నర్‌ సొంతంగా నిర్ణయం తీసుకోవడమే స్టాలిన్‌ ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో గవర్నర్‌ అధికారాలకు కోత పెడుతూ స్టాలిన్‌ ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా విశ్వవిద్యాలయాల చట్టాన్ని సవరించింది.

సంప్రదాయం ప్రకారం ఆయా రాష్ట్రాల్లో ఛాన్సలర్‌గా గవర్నరే ఉంటారు. వర్సిటీల నియామకాలను రాష్ట్ర ప్రభుత్వం సలహా మేరకు గవర్నర్‌ చేపట్టాలి. కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు సొంతంగా వ్యవహరిస్తుండడం ముఖ్యమంత్రుల ఆగ్రహానికి కారణమవుతోంది. వర్సిటీల్లో వీసీల నియామకం గవర్నర్‌కు గౌరవ హోదా మాత్రమే అనే విషయం మరచిపోతున్నారు. వీసీల నియాకంలో ప్రభుత్వాన్ని సంప్రదించకుండా గవర్నరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని ముఖ్యమంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో చాన్సలర్ హోదా నుంచి గవర్నర్‌ను తొలగిస్తూ అసెంబ్లీల్లో బిల్లులను ప్రతిపాదిస్తున్నారు. దీనిపై ఆయా రాష్ట్రాల్లో బీజేపీ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు.

Tags:    

Similar News