Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో సంచలన విషయాలు.. పూణెలో స్కెచ్, యూట్యూబ్ చూసి గన్ ఫైరింగ్

Update: 2024-10-16 09:23 GMT

Baba Siddique Murder Case: బాబా సిద్ధిఖి మర్డర్ కేసులో ముంబై యాంటీ-ఎక్స్‌టార్షన్ సెల్ పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకొస్తున్నాయి. బాబా సిద్ధిఖిని చంపేందుకు సరిగ్గా 3 నెలల క్రితమే నిందితులు కుట్ర పన్నారు. బాబా సిద్ధిఖికి పూణెలో ఓ నివాసం ఉంది. అక్కడి నిందితుల్లో ఒకరు చేతిలో ఆయుధాలు లేకుండా బాబా సిద్ధిఖి ఇంట్లోకి సైతం వెళ్లి వచ్చే వారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పూణెలో బాబా సిద్ధిఖి ఇంటి పరిసరాలు, ముంబైలో జీషాన్ సిద్ధిఖి ఆఫీసు ఉన్న ప్రాంతం మొత్తాన్ని నిందితులు 25 రోజుల క్రితమే సర్వే చేశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న గుర్మైల్ సింగ్, ధర్మరాజ్ కశ్యప్ వెల్లడిస్తున్న వివరాల ఆధారంగా పోలీసులు తమ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు.

ఎంత సుపారీ ఇచ్చారంటే

నిందితుల్లో నాలుగో వాడైన హరీష్ గురించి కూడా పోలీసులు చాలా వివరాలు రాబట్టారు. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కి, తమకు మధ్య సమాచారం మార్పిడి కోసం మొబైల్ ఫోన్స్, 2 లక్షల సుపారీ డబ్బులు ఇచ్చేందుకు, ఆయుధాలు సమకూర్చేందుకు హరీష్ మధ్యవర్తిగా వ్యవహరించినట్లు నిందితులు తెలిపారు. బాబా సిద్ధిఖి మర్డర్ తరువాత భారీ మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆ గ్యాంగ్ ఆశపెట్టినట్లు నిందితులు స్పష్టంచేశారు. బాబా సిద్ధిఖి ఫోటోలు, ఆయన కుమారుడు ఎమ్మెల్యే జీషాన్ సిద్ధిఖి ఫోటోలను హరీష్ తమకు చూపించాడు. తాము వాళ్లను గుర్తుపట్టేందుకు హరీష్ సహకరించినట్లు నిందితులు వెల్లడించారు. హరీష్ గత 9 ఏళ్లుగా పూణెలోనే ఉంటున్నాడు. అతడి ఇంట్లోనే బాబా సిద్ధిఖి మర్డర్‌కి స్కెచ్ వేశామని నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

యూట్యూబ్ చూసి గన్ ఫైరింగ్

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆయుధాలు సమకూర్చిన తరువాత వాటిని ఉపయోగించడం కోసం యూట్యూబ్‌లో గన్ ఫైరింగ్ వీడియోలు చూసి శిక్షణ పొందారు. తుపాకుల్లో లైవ్ మేగజిన్ లేకుండా.. అంటే బుల్లెట్స్ లేకుండా తుపాకీ పొజిషన్ ఎలా తీసుకోవడం, ఎలా లక్ష్యాన్ని గురిపెట్టడం వంటి అంశాల్లో రిహార్సల్స్ చేశారు. గన్ ఫైరింగ్‌లో తమకు కాన్ఫిడెన్స్ వచ్చాకే తమ ప్లానింగ్ అమలు చేశారని ముంబై పోలీసుల విచారణలో తేలింది.

పోలీసులకు చిక్కకుండా కమ్యూనికేషన్

బాబా సిద్ధిఖి మర్డర్ గురించి మొబైల్ ఫోన్లో మాట్లాడుకుంటే పోలీసులకు దొరికిపోతాం అనే భయంతో స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉపయోగించినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. స్నాప్‌చాట్‌లో చాటింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో కాల్స్ చేసుకున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News