ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌1.. ఇస్రో కీలక అప్‌డేట్‌

ISRO: భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందన్న ఇస్రో

Update: 2023-10-01 01:52 GMT

ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌1.. ఇస్రో కీలక అప్‌డేట్‌

ISRO: సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ‘ఆదిత్య- ఎల్ 1 ఉపగ్రహం తన లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కీలక అప్‌డేట్‌ అందజేసింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని తెలిపింది. ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని విజయవంతంగా దాటినట్లు వెల్లడించింది. ప్రస్తుతం లాగ్రేంజ్‌ పాయింట్‌ 1 దిశగా పయనిస్తున్నట్లు చెప్పింది. ఎల్‌ 1 పాయింట్‌ భూమి నుంచి సూర్యుడి దిశగా సుమారు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

భూ గురుత్వాకర్షణ పరిధిని దాటి ఓ వ్యౌమనౌకను ఇస్రో విజయవంతంగా పంపడం ఇది వరుసగా రెండోసారి. అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ మొదటిసారి ఈ ఘనత సాధించినట్లు ఇస్రో తెలిపింది. ఇదిలా ఉండగా.. చంద్రయాన్‌-3 విజయవంతం తర్వాత ఇస్రో ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించింది. సెప్టెంబరు 2న ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహాన్ని తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ఆదిత్య-ఎల్‌1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. లాగ్రేంజ్‌ పాయింట్‌ 1 వద్ద భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. ఇక్కడి నుంచి ఉపగ్రహాలు సూర్యుడిపై పరిశోధనలు చేసే వీలుంటుంది.

Tags:    

Similar News