కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో తొక్కిసలాట.. నలుగురు విద్యార్థులు మృతి, 64 మందికి గాయాలు
Kerala: ఉన్నట్లుండి వర్షం రావడంతో వేదిక వద్దకు..పరుగులు తీసిన విద్యార్థులు.. మెట్లపై నుంచి క్రింద పడిన మరికొందరు
Kerala: కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ వార్షిక వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కసలాటలో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటనలో 64 మంది విద్యార్థులు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. యూనివర్సిటీ వార్షిక వేడుకల్లో భాగంగా ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో సంగీత కచేరీ ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత గాయకురాలు నికితా గాంధీతో పాటు పలువురు కార్యక్రమానికి హాజరుకావడంతో 2 వేల మందికి పైగా విద్యార్థులు వేడుకలకు హాజరయ్యారు.
దీంతో ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది. కచేరీ జరుగుతుండగా..ఉన్నట్టుండి వర్షం కురవడంతో విద్యార్థులంతా వేదిక దగ్గరకు పరుగులు తీసారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆడిటోరియంకు ఒకటే ద్వారం ఉండటంతో గందరగోళం నెలకొంది. కొందరు విద్యార్థులు ఆడిటోరియం మెట్ల మీది నుంచి క్రింద పడిపోయారు. వారిని మిగతా వారు తొక్కుకుంటూ పరుగులు తీయడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేరళ సీఎం పినరాయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.