దేశవ్యాప్తంగా 2,50,183 కరోనా యాక్టివ్‌ కేసులు

* కేరళ, మహారాష్ట్ర, యూపీ, ప.బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌లోనే 62 శాతం కేసులు * వెల్లడించిన కేంద్ర ఆరోగ్యశాఖ * గుజరాత్‌లో నలుగురికి యూకే కరోనా

Update: 2021-01-03 05:17 GMT

దేశంలో 2లక్షల 50వేల 183 యాక్టివ్‌ కేసులు ఉండగా వీటిలో 62 శాతం కేసులు కేరళ, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం కేరళలో 65 వేల 54 యాక్టివ్‌ కేసులుండగా, 3 వేలకుపైగా మరణించారు. సుమారు 2 మిలియన్ల కరోనా కేసులు నమోదైన మహారాష్ట్రలో 52 వేల 84 కేసులున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 13 వేల 831, పశ్చిమ బెంగాల్‌లో 11వేల 616, ఛత్తీస్‌గఢ్‌లో 11వేల 344 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

మరోవైపు యూకే కరోనా దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గుజరాత్‌లో నలుగురికి కొత్త రకం కరోనా సోకినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ స్క్రీన్‌ టెస్ట్ చేసి వారి శాంపిల్స్‌ను పుణెలోని ఎన్‌ఐవీకి పంపించారు. వీరిలో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మరో 15 మంది ప్రయాణికుల కరోనా ఫలితాలు రావాల్సి ఉందని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం బాధితులు నలుగురు అహ్మదాబాద్‌లోని ఎస్‌వీపీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు.

మరోవైపు బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది  బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త స్ట్రెయిన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తం అయింది. గత నెలలో యూకే విమాన సర్వీసులపై నిషేధం విధించింది. అయితే ఈ నెల 6 నుంచి మళ్లీ విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్టు పౌర విమానాయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు యూకే నుంచి వచ్చే వారి కోసం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ మార్గదర్శకాలను ప్రకటించింది.

బ్రిటన్ నుంచి భారత్ వచ్చే ప్రయాణీకులందరికీ కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ను తప్పనిసరి చేసింది. ప్రయాణీకులు తమకు చేసే ఆర్టీపీసీఆర్ పరీక్షలను సొంత ఖర్చులతో చేయించుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణీకులను విమానంలోకి అనుమతించే ముందు విమానయాన సంస్థలు కరోనా నెగెటివ్ టెస్ట్ రిపోర్టును నిర్ధారించాలన్నారు. యూకే నుంచి వచ్చే ప్రయాణీకులందరూ భారత విమానాశ్రయాలకు చేరగానే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. కరోనా నెగిటివ్ వచ్చినవారు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని, ఈ నిబంధనలు జనవరి 30 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది. 

Tags:    

Similar News