బిగ్ బాస్3 హైలైట్స్: నాయకుడి నుంచి సేవకుడిగా..వరుణ్ బిగ్ బాస్ షాక్!
బిగ్ బాస్ క్రమేపీ బిగిస్తున్నాడు. హౌస్ లో నియమోల్లంఘనలు సహించేది లేదని స్పష్టం చేశాడు. ఎవరు ఎలా ఉంటారన్న విషయాన్ని సీక్రెట్ టాస్క్ ద్వారా ప్రత్యక్షంగా చూపించాడు. ఇవీ బిగ్ బాస్ ఎపిసోడ్ 20 విశేషాలు..
బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో ఉన్న తిక్క చేష్టల్ని తగ్గించే పనిలో పడ్డాడు. ముఖ్యంగా నియమాల్ని ఉల్లంఘిస్తున్న తీరుని మార్చేందుకు శిక్షలు విధిస్తూ అందర్నీ క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇటు సీక్రెట్ టాస్క్ లో ఉన్న పునర్నవి, అలీలతో హౌస్ మేట్స్ గురించి చెడు నిజాలు చెప్పించి వాటిని వారందరికీ వీరిద్దరికీ తెలీకుండా చూపించి కలహాల కుంపటి పెట్టాడు.
కలహాల కుంపటి..
మామూలుగా ఆడితే బిగ్ బాస్ మజా ఏముంటుంది? ఒకరికి తెలీకుండా ఒకరు గోతులు తవ్వే కార్యక్రమం లేకపోతే ఆట రంజుగా ముందుకు సాగదు కదా.. అందుకే అలీ, పునర్నవిలకి సీక్రెట్ టాస్క్ ఇచ్చి పక్కకు తీసుకు వెళ్లి.. మిగిలిన హౌస్ మేట్స్ మీద వారికున్న అభిప్రాయాల్ని చెప్పే కార్యక్రమం పెట్టాడు. నిన్న వారిద్దరినీ మాయం చేసిన బిగ్ బాస్ వారిని పక్క గదిలో ఉంచిన సంగతితెలిసిందే. అక్కడ ఒక టార్గెట్ బోర్డ్ మీద హౌస్ మేట్స్ ఫోటోలు ఉంచారు. వాటిలో ఒక్కోరిని ఎంచుకుని వారిలో లోపం ఏమిటనేది పునర్నవి, అలీ చెప్పాలి. వాళ్ళూ చక్కగా అందరి గురించి పూసగుచ్చినట్టు చెప్పేశారు. ఇక్కడే చిన్న ట్విస్ట్ పెట్టాడు. వాళ్ళిద్దరూ ఇది ఎవరికీ తెలీదని బిగ్ బాస్ సీక్రెట్ గా చెప్పమన్నారని అనుకున్నారు. కానీ, బిగ్ బాస్ హౌస్ లో అందర్నీ.. లివింగ్ రూమ్ లో కూచోపెట్టి టీవీలో ఈ కార్యక్రమాన్ని లైవ్ లో చూపించారు. సో, అందరికీ వాళ్ళిద్దరూ తమ గురించి ఏమనుకున్తున్నారన్న విషయం స్పష్టం అయింది. అక్కడితో వీళ్ళ సీక్రెట్ టాస్క్ పూర్తయింది.
మీరు చేసింది ఇది.. క్రమ "శిక్ష"ణ తప్పదు..
ఇక ఈ ఎపిసోడ్ ఎక్కువ లివింగ్ రూమ్ లో హౌస్ మేట్స్ అందర్నీ కూచోపెట్టి క్రమశిక్షణా కార్యక్రమానికి పూనుకున్నాడు బిగ్ బాస్. వారందరూ ఎక్కడెక్కడ.. ఎప్పుడు.. ఎలా ఇంటి నియమాలు తప్పారు అనేది టీవీలో వారికి చూపించాడు బిగ్ బాస్ తరువాత కెప్టెన్ తో మొదలు పెట్టాడు క్రమశిక్షణా చర్యలు. ఇంటి కెప్టెన్ మొదటి ముఖ్యమైన విధి సభ్యులు ఎవరూ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా చూడాలి. కానీ, వరుణ్ ఎక్కడా కూడా అలా చేయలేదు. అంతే కాకుండా తనూ నియమాల్ని దాటి ప్రవర్తించాడు. ఈ విషయాన్ని స్పష్టం చేసిన బిగ్ బాస్ అందుకు శిక్ష విధించాడు. ఇంటి కెప్టెన్ పదవి నుంచి వరుణ్ ను తీసేసినట్టు ప్రకటించాడు. తరువాత, శిక్షగా ఆటను హౌస్ మేట్స్ కి సేవకుడిగా వ్యవహరించాలి అని స్పష్టం చేశాడు. సభ్యులు ఎప్పుడు బయటకు వెళ్ళినా, లోపలి వచ్చినా తలుపు తెరిచి పట్టుకోవాలని చెప్పాడు. అంతే కాకుండా సభ్యులు తిన్న బౌల్స్, ప్లేట్స్ క్లీన్ చేయాలని శిక్ష విధించాడు. ఇక మిగిలిన వాళ్ళకూ శిక్షలు విధించాడు బిగ్ బాస్ అయితే.. అవి కొంత వినోదాన్ని పంచేవిధంగా ఉన్నాయి. కన్నాలతో ఉన్న నీటి డ్రమ్ములలో నీరు బయటకు పోకుండా చూడడం. ఎవరు ఎక్కడ తప్పు చేసినా లేడీ బ్యాచ్ స్విమ్మింగ్ పూల్ లో దూకి మునకేయడం.. ఇవీ వారికిచ్చిన శిక్షలు.
కష్టపడి అంతా తమ శిక్షలు పూర్తి చేశారు. వారిని రిలాక్స్ అవమని చెప్పాడు బిగ్ బాస్. వరుణ్ శిక్ష మాత్రం పూర్తీ కాలేదు.
ఎలావుందంటే..
ముందే చెప్పినట్టు.. కలహాలకు మార్గం సిద్ధం చేశాడు బిగ్ బాస్. ఇక అందరూ ఒకరితో ఒకరు పైచేయి కోసం ఆటాడే పరిస్తితులు కల్పించాడు. ముందు జరగబోయే ఆటలో నియమోల్లంఘనలు జరిగితే ఎలా ఉంటుందో హెచ్చరికలూ జారీ చేశాడు. తమతో చక్కగా ఉండేవాళ్ళు తమ వెనుక ఎలా మాట్లాడుకోవచ్చో అలీ, పునర్నవిల సీక్రెట్ టాస్క్ తో అందరికీ అర్థం అయ్యేలా చెప్పాడు.
మొత్తమ్మీద ఎపిసోడ్ రాబోయే ఎపిసోడ్ లకు కర్టెన్ రైజర్ గా చెప్పుకోవచ్చు.