Kalki 2: ప్రభాస్ ‘కల్కి2’ రిలీజ్.. అశ్వనీదత్ ఏం చెప్పారంటే!
Kalki 2: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది.
Kalki 2: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD. భారీ అంచనాల మధ్య గత ఏడాది విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా బాహుబలి తర్వాత ప్రభాస్‌కు హిట్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్నట్టు ఇప్పటికే చిత్రబృందం వెల్లడించింది. దీంతో కల్కి2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత అశ్వినీ దత్ ఓ ఇంటర్వ్యూలో కల్కి2 గురించి మాట్లాడుతూ కీలక అప్డేట్ ఇచ్చారు. కల్కి2 వచ్చే ఏడాది విడుదలవుతుంది అంటూ తెలిపారు. అంతేకాదు తన అల్లుడు, డైరెక్టర్ నాగ్ అశ్విన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కల్కి మొదటి భాగంలో భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతోంది? అనేది ఊహాజనితంగా చూపించారు. ఇక చివర్లో మహాభారత్ ఎపిసోడ్, అందులో కర్ణుడు, అర్జునుడు సీన్స్ హైలెట్‌గా నిలిచాయి. ఈ సన్నివేశాలు ఇంకొంత సేపు ఉంటే బాగుండేదని చాలామంది ఆశపడ్డారు. అయితే ఇప్పుడు వాళ్ల కోరిక నెరవేరబోతోంది అంటూ నిర్మాత చెప్పుకొచ్చారు. రెండో పార్ట్ కోసం ఎంతో శ్రమిస్తున్నాం. ఏప్రిల్ నెలలో షూటింగ్ ప్రారంభమవుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా విడుదలకు కాస్త ఆలస్యం అవుతుంది. దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నానని అన్నారు.
రెండో పార్ట్ మొత్తం కమల్ హాసన్ ఉంటారు. ప్రభాస్, కమల్ హాసన్ మధ్య సన్నివేశాలు ఉంటాయి. అమితాబ్ బచ్చన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ మూడు పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. వీళ్లే ఈ సినిమాకు మెయిన్ వీళ్లతో పాటు దీపికా పడుకుణె పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుందని అశ్వినీ దత్ తెలిపారు.
ఇక నాగ్ అశ్విన్ గురించి మాట్లాడుతూ.. మంచి దర్శకుడు అంటూ కొనియాడారు. మహానటి సినిమా తీసే సమయంలో ఎక్కడా భయం లేకుండా షూటింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత కల్కి రూపొందించాడు. రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. నాగ్ అశ్విన్ జీవితంలో ఓటమనేది ఉండదని నేను నమ్ముతాను. అతని ఆలోచన విధానం, సినిమాలను తెరకెక్కించే తీరు చాలా గొప్పగా ఉంటాయి అంటూ అల్లుడు కం డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు.
వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ కల్కి 2898 ఏడీ చిత్రాన్ని నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన ఈ చిత్రంలో అమితాబ్, కమల్ హాసన్ పాత్రలు ఆకట్టుకున్నాయి. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రలో కనిపించారు. బౌంటీ ఫైటర్ భైరవగా సందడి చేసిన ప్రభాస్ చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్2 పై మరిన్ని అంచనాలు పెంచేశారు. చూడాలి మరి కల్కి2 సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో.