Sankranthiki Vasthunam Review: నవ్వుల గోదావరి..!
Sankranthiki Vasthunam Review: విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ఇద్దరిదీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇప్పటికీ ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు చేసి మంచి హిట్లు కొట్టారు.
Sankranthiki Vasthunam Review: విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి ఇద్దరిదీ సక్సెస్ఫుల్ కాంబినేషన్. ఇప్పటికీ ఎఫ్2, ఎఫ్3 లాంటి సినిమాలు చేసి మంచి హిట్లు కొట్టారు. ఇలాంటి కాంబినేషన్లో మరో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే అందరిలో ఆసక్తి ఏర్పడింది. అందుకు తగ్గట్టుగానే సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తో సినిమా అనౌన్స్ చేయడంతో అసలు ఏంట్రా ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది అని ఆసక్తి కలిగింది. దానికి తగ్గట్టుగానే ముందు కథ చెప్పేసి సినిమా ఎలా ఉండబోతోంది అని ముందే క్లారిటీ ఇచ్చేసాడు అనిల్ రావిపూడి.
తరువాత సినిమా ప్రమోషన్స్ భిన్నంగా చేయడం, మిగతా రెండు సంక్రాంతి సినిమాల కంటే ఎక్కువగా ఇదే సినిమా ప్రేక్షకులలోకి బాగా చొచ్చుకు వెళ్లడంతో కచ్చితంగా సినిమా చూడాలని అందరిలో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడంలో టీం సక్సెస్ అయింది. అలాంటి ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రేక్షకులకు ముందుకొచ్చింది. మరి సినిమా ఎలా ఉంద ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన ఈ సినిమా ఆసక్తిని నిలబెట్టగలిగిందా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే.
కథ:
మీనాక్షి (మీనాక్షి చౌదరి) ఒక ఐపీఎస్. ఫారిన్ నుంచి వచ్చిన తెలుగువాడైన ఓ బడా కంపెనీ సీఈవో సత్య ఆకెళ్ళ (అవసరాల శ్రీనివాస్) కి సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఆమె మీద పడుతుంది. అయితే సీఎం కేశవ(నరేష్)ను ఒప్పించి సత్యను తన ఫామ్ హౌస్ లో మంచి ట్రెడిషనల్ తెలంగాణ విందు భోజనం పెట్టిస్తానని తీసుకువెళ్తాడు పార్టీ ప్రెసిడెంట్(వీటివి గణేష్). అయితే జైల్లో ఉన్న తన సోదరుడిని విడిపించాలనే డిమాండ్తో ఒక ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్టర్ ఫామ్ హౌస్ నుంచి సత్యను కిడ్నాప్ చేస్తాడు. విషయం బయటికి చెప్పలేరు కాబట్టి సమర్థవంతమైన ఒక అండర్ కవర్ కాప్ కోసం చూస్తున్న సమయంలో దామోదర్ రాజు( వెంకటేష్) అనే ఒక మాజీ పోలీస్ అధికారి ఈ ఆపరేషన్ కి కరెక్ట్ గా సెట్ అవుతాడని అతన్ని రంగంలోకి దించే ప్రయత్నం చేస్తారు.
మీనాక్షితో ఒకప్పుడు ప్రేమలో ఉండి విడిపోయిన దామోదర్ రాజు తర్వాత గోదావరి జిల్లాకి చెందిన భాగ్యం(ఐశ్వర్య రాజేష్)ను వివాహం చేసుకొని నలుగురు పిల్లలకు తండ్రవుతాడు. అయితే మీనాక్షి ఎంట్రీ ఇచ్చి అలాంటి దామోదర్ రాజుని ఆపరేషన్ కోసం ఒప్పించి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. దామోదర్ రాజు మాజీ ప్రేయసి కోరిక మేరకు ఆపరేషన్ లోకి ఎంట్రీ ఇస్తాడా? సత్య ఆకెళ్లను అసలు విడిపించగలిగారా? తన భర్తను మాజీ ప్రేయసితో పంపేందుకు ఐశ్వర్య ఒప్పుకుందా? లాంటి విషయాలే ఈ కథ.
విశ్లేషణ:
అదేదో పాత సినిమాలో వేణుమాధవ్ క్వశ్చన్ లు మీరు అడుగుతారా? లేక మీరు అడిగే క్వశ్చన్లకు ముందే మేము సమాధానాలు చెప్పాలా అన్నట్టు ఈ సినిమా కథ ఏమిటి అనే విషయం ముందే చెప్పేసింది సినిమా టీం. ఒక పోలీసు మాజీ అధికారి సాయం కోసం అతని ప్రేయసి, ప్రస్తుత పోలీస్ అధికారిణి వెళితే పెళ్లయి సంసార బంధంలో ఉన్న సదరు మాజీ పోలీసు అధికారి వస్తాడా? రాడా? వస్తే ఏం చేస్తాడు అనేది లైన్. దానిని ప్రేక్షకులు మెచ్చేలా, కడుపుబ్బ నవ్వించేలా తీసుకురావడంలో అనిల్ రావిపూడి టీం దాదాపు సక్సెస్ అయింది. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచే ఒక రకమైన నవ్వుల రైడ్ మొదలవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సీన్లు గోదావరి జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక ఆ కామెడీకి అడ్డే లేదు అన్నట్టు ఫస్ట్ ఆఫ్ ప్రీ ఇంటర్వల్ వరకు సాగుతుంది.
ఇక సెకండ్ హాఫ్ లో కామెడీకి బ్రేకులు వేసి కాస్త యాక్షన్ సీన్స్ లో దిగిన హీరో చివరికి ఆలోచింపచేస్తూ కొంత ఎమోషనల్ టచ్ ఇస్తూ ప్రేక్షకులను ఇంటికి పంపించే ప్రయత్నం చేశాడు. ఇక సినిమా క్లైమాక్స్ లో తీసుకున్న ఒక పాయింట్ మంచిదే అయినా ఎందుకో కావాలి అని ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులను నవ్వించడానికి ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని చేసినట్టు అనిపిస్తుంది. కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా పలు అంశాలను మిళితం చేసిన విధానం ఆకట్టుకుంది. అయితే అలా అని లాజిక్స్ కి అందని సీన్లు చాలా ఉన్నాయి. కేవలం ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా సాగిపోతుంది, ఇక్కడ అలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరిగింది? అనే ఆలోచనలో పెట్టుకుంటే సినిమాను ఎంజాయ్ చేయలేరు.
నటీనటుల విషయానికి వస్తే మాజీ పోలీసు అధికారి పాత్రలో విక్టరీ వెంకటేష్ ఇమిడిపోయాడు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా యాస మాట్లాడుతూ తనదైన శైలిలో కొట్టిన పిండి లాంటి పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. ఇక ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ కూడా అంతే స్థాయిలో నటించింది. తెలుగు అమ్మాయి కావడంతో ఆమెకు మరింత ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఇక ఆమె పాత్రతో పోటీపడి నటించే ప్రయత్నం చేసింది మీనాక్షి కూడా. ఇక యానిమల్ నటుడు ఉపేంద్ర సహా తమిళనట్యుడు వీటీవీ గణేష్ కామెడీ ట్రాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. వడ్లమాని శ్రీనివాస్, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయికుమార్ వంటివాళ్లు చేసింది చిన్న పాత్రలే అయినా పండుగ సినిమాలో మెప్పించారు.
ఇక మిగతా పాత్రధారులు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ముందుగా అందరూ మాట్లాడుకునేది సినిమా మ్యూజిక్ గురించి. సినిమా ఈరోజు ప్రేక్షకులలోకి విపరీతంగా చొచ్చుకపోవడానికి కారణం మ్యూజిక్ డైర్కెటర్ భీమ్స్. ఆ మ్యూజిక్ వినడానికే కాదు స్క్రీన్ మీద కూడా చాలా బాగుంది. ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాడు. ఒక పండుగ సినిమా ఎలా ఉండాలో అలా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చాడు ఆయన. ఇక డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉండడమే కాదు ఆలోచింపజేసేలా ఉన్నాయి. ఒకపక్క నవ్విస్తూనే ఆలోచింపచేసేలా కథ మలుచుకున్న తీరు బాగుంది. దిల్ రాజు, శిరీష్ నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి.
హెచ్ఎంటీవీ వర్డిక్ట్ : సంక్రాంతికి వస్తున్నాం.. లాజిక్స్ వెతుక్కోకుండా ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేయతగ్గ మూవీ.