దుబాయ్ కారు రేసులో గెలిచిన హీరో అజిత్.. దేశ వ్యాప్తంగా ప్రశంసల వెల్లువ.. ఎవరేమన్నారంటే..

Update: 2025-01-13 10:06 GMT

Ajith Kumar team won in Dubai Car racing: దుబాయ్ కారు రేసింగ్‌లో హీరో అజిత్ టీమ్ 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. దీంతో అజిత్‌కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రేసింగ్‌కు రెండు రోజుల ముందు ప్రమాదం నుంచి బయటపడిన అజిత్ పోటీల్లో టాప్‌లో నిలిచారు. అజిత్ కుమార్ రేసింగ్ పేరుతో ఇటీవల ఒక రేసింగ్ టీమ్‌ను ప్రకటించిన ఆయన తాజాగా తన టీమ్‌తో కలిసి దుబాయ్ వేదికగా జరుగుతోన్న 24 హెచ్‌ దుబాయ్ కారు రేసింగ్‌లో పాల్గొని విజయాన్ని అందుకున్నారు. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు అజిత్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అభినందనలు అజిత్. నువ్వు సాధించావు లవ్‌యూ అంటూ రజనీకాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తొలి రేసులో అజిత్ కుమార్ రేసింగ్ టీమ్ అసాధరణ విజయాన్ని సాధించింది. నా స్నేహితుడు అజిత్ వైవిధ్యమైన అభిరుచుల్లో సత్తా చాటుతున్నారు. ఇవి గర్వకారణమైన క్షణాలు అన్నారు కమల్ హాసన్.

మీరు ఇప్పటివరకు సాధించిన విజయాలతో ఆగిపోకుండా.. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగుతున్నారు. కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనే దానికి మీరే ప్రత్యేక ఉదాహరణ అంటూ సమంత పోస్ట్ చేశారు.

అజిత్ సర్.. ఇది అద్బుతమైన విజయం. మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు.. మీ విజయాన్ని చూసి నేను థ్రిల్ అయ్యాను. మన దేశానికి, తమిళనాడుకు మరింత కీర్తిని తీసుకురావాలని కోరుకుంటున్నా అన్నారు ఉదయనిధి స్టాలిన్.

తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరో అజిత్‌ను అభినందించారు. అజిత్ కుమార్, ఆయన టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు. గొప్ప సంకల్పంతో సవాళ్లను అధిగమించి ప్రపంచ వేదికపై భారతీయ జెండాను ఎగురవేయడం నిజంగా స్ఫూర్తిదాయకం. మీరు, మీ టీమ్ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నానన్నారు పవన్ కళ్యాణ్.

ఇదిలా ఉంటే రేసులో గెలిచిన ఆనందాన్ని అజిత్ తన కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. తన భార్య షాలినికి థ్యాంక్స్ చెప్పారు. ఆమెను ఆప్యాయంగా హత్తుకున్నారు.

షాలు నన్ను ఈ రేసులో పాల్గొనడానికి అనుమతించినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

Tags:    

Similar News