Vishal's Health Condition: నటుడు విశాల్ గురించి గత కొన్ని రోజులుగా నెట్టింట పెద్ద ఎత్తున చర్చ నడిచిన విషయం తెలిసిందే. ఇటీవల మద గజ రాజ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విశాల్ పూర్తిగా అనారోగ్యంగా కనిపించారు. కనీసం మైక్ కూడా పట్టుకునే పరిస్థితిలో లేరు. చేయి వణుకుతున్నట్లు, ముఖమంతా ఉబ్బినట్లు కనిపించింది. దీంతో ఆయన అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు. విశాల్ ఏదో అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగింది.
దీంతో అసలు విశాల్‌కు ఏమైందని అంతా చర్చించుకున్నారు. అయితే విశాల్‌కు ఏం కాలేదని కేవలం వైరల్ ఫీవర్ కారణంగా బలహీనంగా మారారని, అందుకే అలా ఉన్నారని ఖుష్బు, జయం రవి వంటి కొందరు సినీ తారలతో పాటు విశాల్ పర్సనల్ టీమ్ సైతం స్పందించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మొదటి సారి హీరో విశాల్ ఈ వార్తలపై స్పందించారు. గత కొన్ని రోజులుగా జరుగుతోన్న చర్చకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా శనివారం సాయంత్రం ‘మద గజ రాజ’ ప్రీమియర్‌కు హాజరైన విశాల్ తాను ఆరోగ్యంగానే ఉన్నానని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. అంతా బాగానే ఉంది' అని చెప్పుకొచ్చారు.
ఇక ప్రస్తుతం తన చేతులు కూడా వణకడం లేదని, మైక్ కూడా కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నానని తెలిపారు. తనపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపిన విశాల్.. తుది శ్వాస వరకూ తనపై చూపిన అభిమానాన్ని మర్చిపోనని తెలిపారు. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయని చెప్పుకొచ్చారు. మొత్తం మీద గత కొన్ని రోజులుగా విశాల్ ఆరోగ్యానికి సంబంధించి వైరల్ అవుతోన్న పుకార్లకు చెక్ పెట్టి నట్లైంది. ఇదిలా ఉంటే మద గజ రాజ సినిమా విషయానికొస్తే.. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితమే పూర్తైనప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.