Allu Arjun: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట
Allu Arjun: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో శనివారం ఊరట దక్కింది.
Allu Arjun: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో శనివారం ఊరట దక్కింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరుకావాలనే నిబంధనకు నాంపల్లి కోర్టు మినహాయించింది.ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి భద్రత సమస్యలున్నాయని.. ఈ నిబంధనను మినహాయించాలని ఆయన నాంపల్లి కోర్టును అభ్యర్ధించారు.
ఈ అభ్యర్థనపై కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నిబంధనను మినహాయించింది. ఈ నెల 3న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేసింది. ఈ బెయిల్ ను మంజూరు చేసిన సమయంలో ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దీంతో గత ఆదివారం ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మరో వైపు విదేశాలకు వెళ్లేందుకు కూడా అల్లు అర్జున్ కు కోర్టు అనుమతించింది.
పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా 2024 డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ ను పోలీసులు ఏ 16 గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఆయనను డిసెంబర్ 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున తెలంగాణ హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు సూచన మేరకు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఆయనకు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు.