Game Changer: ప్రత్యేక షోలకు అనుమతిపై హైకోర్టు అసంతృప్తి

Game Changer: బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Update: 2025-01-10 08:20 GMT

Game Changer: బెనిఫిట్ షోలు రద్దు చేశామని ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడం ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. గేమ్ ఛేందజర్ సినిమాకు టికెట్ల ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై శుక్రవారం తెలంగాణ హైకోర్టు విచారించింది. ప్రత్యేక షోలకు అనుమతివ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బెనిఫిట్ షోలు రద్దు చేసి ప్రత్యేక షోలకు ఎందుకు అనుమతి ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. అర్ధరాత్రి, తెల్లవారుజాము షోలకు అనుమతి ఇవ్వడంపై పున:సమీక్షించాలని తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. గేమ్ ఛేంజర్ సినిమా ప్రత్యేక షోలకు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ పెంపునకు, ప్రత్యేక షోలకు అనుమతిని ఇచ్చింది. జనవరి 11 నుంచి 23 వరకు ప్రత్యేక ధరలు అమల్లో ఉంటాయి. అర్ధరాత్రి 1 గంటలకు బెనిఫిట్ షో ధరను రూ.600గా నిర్ణయించారు. జనవరి 10న ఆరు షోలకు అనుమతి ఇచ్చారు. మల్టీఫ్లెక్స్ లో అదనంగా రూ. 175, సింగిల్ థియేటర్లలో రూ. 135 వరకు టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవని ప్రకటించింది. కానీ, గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రత్యేక షోలతో పాటు టికెట్ పెంపునకు అనుమతి ఇచ్చింది.

Tags:    

Similar News