Daaku Maharaj: డాకు మహారాజ్ ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు.. కారణం ఏంటంటే..?
Daaku Maharaj pre-release event postponed: నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే.
Daaku Maharaj pre-release event postponed: నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో 'డాకు మహారాజ్' సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. జనవరి 12వ తేదీన సినిమాను విడుదల చేయనున్న నేపథ్‌యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచింది. ఇందులో భాగంగానే గురువారం భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సన్నాహాలు చేసింది.
అనంతపురంలో గ్రాండ్‌గా ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్ర యూనిట్ భావించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అయితే చివరి క్షణంలో ఈ ఈవెంట్‌ను రద్దు చేసింది. దీనికి కారణం తిరుపతిలో జరిగిన అపశృతి. తిరుమల వైకుంఠద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన దుర్ఘటనలో పలువురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ఈవెంట్‌ను రద్దు చేస్తూ నిర్ణయించింది.
ఈ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ వస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే తిరుపతిలో జరిగిన ఘటన నేపథ్యంలో దీన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘‘తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం. బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని పోస్ట్ చేశారు.