Nithya Menon in Kadhalikka Neramillai promotions: హీరోయిన్ నిత్యామీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. గ్లామర్ రోల్స్‌కు ఆమడ దూరంలో ఉంటూ తన సహజ నటనతో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఆమె నటనకు ఇటీవల జాతీయ అవార్డు కూడా వరించింది. ఇలా నేషనల్ వైడ్‌గా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు అసలు సినిమాలే చేయనంటూ అందరికీ షాక్ ఇచ్చారు నిత్యామీనన్.
మొన్నటివరకు మంచి పాత్రలు అయితే చాలు చిన్న సినిమా అయినా అంగీకరిస్తానన్న నిత్యా మీనన్.. ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాక సినీ ఇండస్ట్రీని శాశ్వతంగా వదిలేస్తానంటోంది. ప్రస్తుతం నిత్యా మీనన్ తమిళ చిత్రం కాదలిక్క నెరమిళ్లై లో నటించారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నిత్యామీనన్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడడం, డ్యాన్స్ చేయడం, యాక్టింగ్ చేయడం ఇవన్నీ చిన్ననాటి నుంచే మా అమ్మ నాతో చేయించారు. నిజం చెప్పాలంటే, నాకు సినిమా అంటే ఇష్టం లేదు. అయినా ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
సినిమాలు వదిలేయాలని అనుకున్న ప్రతిసారి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇటీవల ఇకపై సైలెంట్‌గా సినిమాలు మానేస్తానని అనుకున్న సమయంలోనే తిరుచిత్రంబళం చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. అప్పుడే నాకు ఒక విషయం స్పష్టమైంది. నేను సినిమాలు మానేసినా.. సినిమా మాత్రం నన్ను వదిలిపెట్టదన్నారు. ఇప్పటికిప్పుడు నాకు వేరే ఇండస్ట్రీలో ఏదైన అవకాశం వస్తే కచ్చితంగా దాంట్లోకి వెళ్లిపోతాను. నాకు సాధారణ జీవితం గడపాలని ఉంది. నటిగా ఉన్నప్పుడు బయటకు స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు. పార్కులో నడవాలని అనిపించినా.. అది సాధ్యం కాదు. ట్రావెలింగ్ అంటే నాకు ఎంతో ఇష్టం. పైలట్ అవ్వాలని చిన్ననాటి నుంచి కల. ఇలా ఎన్నో కోరికలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు నిత్యామీనన్.
ఇక నిత్యామీనన్ సినిమాల విషయానికొస్తే.. తెలుగులో అలా మొదలైది సినిమాతో మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత 180, ఇష్క్, జబర్దస్త్, గుండె జారి గల్లంతయ్యిందే, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, సన్నాఫ్ సత్యమూర్తి, రుద్రమదేవి, ఒక అమ్మాయి తప్ప, జనతా గ్యారేజ్, అ, నిన్నిలా నిన్నిలా, భీమ్లా నాయక్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ప్రస్తుతం తమిళంలో ఇడ్లీ కడాయ్, డియర్ ఎక్సెస్ (Nithya Menon in idly kadai, Dear Exes) సహా మరో సినిమాలో నటిస్తున్నారు.