Dil Raju: తెలంగాణ ప్రజలకు దిల్ రాజు క్షమాపణ.. ఎందుకంటే..?
Dil Raju: తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు సారీ చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
Dil Raju: తెలంగాణ ప్రజలకు నిర్మాత దిల్ రాజు సారీ చెప్పారు. సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
నిజామాబాద్ జిల్లా వాసిగా తన సినిమా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్‌ను అక్కడే చేశానన్నారు దిల్ రాజు. ఈ వేడుకలో తాను తెలంగాణ సంస్కృతిలో ఉండే దావత్ గురించి మాట్లాడానన్నారు. తెలంగాణ వారిని తాను అవమానించానని.. హేళన చేశానంటూ తనపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ ఇస్తూ తెలంగాణ సంస్కృతిని తాను అభిమానిస్తానన్నారు దిల్ రాజు.
మన సంస్కృతి నేపథ్యంలో నేను రూపొందించిన బలగం మూవీని తెలంగాణ సమాజం మొత్తం ఆదరించిందని గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ చిత్రాన్ని అభినందించాయన్నారు. బాన్సువాడలోనే ఫిదా సినిమా తెరకెక్కించాం. ఆ చిత్రం తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసింది. తెలంగాణ వాసిగా నేను ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని హేళన చేస్తాను అని దిల్ రాజు అన్నారు.
అసలేం జరిగిందంటే.. ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను తన సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. మా నిజామాబాద్ తెల్ల కల్లుకు ఫేమస్. పొద్దునపూట నీర తాగితే వేరే లెవల్ ఉంటుంది. మా వోళ్లకు సినిమా అంటే అంత ఆసక్తి ఉండదు. అదే ఆంధ్రకు వెళ్తే సినిమాకు స్పెషల్ వైబ్ ఇస్తారు. తెలంగాణలో మటన్, తెల్లకల్లుకే వైబ్ ఇస్తారు అని అన్నారు. అయితే దిల్ రాజు స్పీచ్‌కు అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టినా సోషల్ మీడియాలో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ వాసి అయ్యుండి మన ప్రాంతాన్ని కించపరిచేలా మాట్లాడుతారా? అని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదంపై స్పందించిన దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు. తన వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించండి అని చెప్పుకొచ్చారు.
ఇక సంక్రాంతి బరిలోకి గేమ్ ఛేంజర్ దిగిపోగా.. జనవరి 12న డాకు మహారాజ్ ఎంట్రీ ఇవ్వనుంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలకు నిర్మాత దిల్ రాజు.