Los Angeles Wildfires: మీరు రియల్ హీరోలు.. లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై స్పందించిన ప్రియాంక చోప్రా..!

Priyanka Chopra: అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హాలీవుడ్‌కు కేంద్రం.

Update: 2025-01-16 12:06 GMT

Los Angeles Wildfires: మీరు రియల్ హీరోలు.. లాస్ ఏంజెల్స్ కార్చిచ్చుపై స్పందించిన ప్రియాంక చోప్రా..!

Priyanka Chopra: అమెరికాలోని లాస్ ఏంజల్స్ ప్రకృతి సౌందర్యానికి నిలయం. ప్రపంచ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ హాలీవుడ్‌కు కేంద్రం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కుబేరులు నివసించే ప్రాంతం ఇది. అలాంటి లాస్ ఏంజల్స్‌లోని పలు ప్రాంతాలు ఇప్పుడు మంటల్లో తగలబడిపోతున్నాయి. విలాసవంతమైన విల్లాలు, కాస్ట్లీ రిసార్ట్‌లు, భారీ బిల్డింగులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. ఈ అగ్ని ప్రమాదాలు అడవులనే కాదు.. కాలనీలను బూడిద చేస్తున్నాయి. మనుషులు కూడా ఈ మంటల్లో సజీవ దహనం అవుతున్నారు. లక్షల మంది సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లాస్ ఏంజల్స్‌లోనే నివాసముంటున్నారు. అయితే తాజాగా దీనిపై ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విధ్వంసానికి సంబంధించిన ఫొటోలను పంచుకున్న ప్రియాంక.. అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. తాను ఎంత బాధపడుతున్నానో మాటల్లో చెప్పలేనన్నారు. ఈ కార్చిచ్చు నుంచి తన కుటుంబాన్ని కాపాడిన వారికి రుణపడి ఉంటానన్నారు. తన స్నేహితులు, సహచరులు ఎంతో మంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారని చెప్పారు.

ఈ మంటల కారణంగా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరమన్నారు. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పనిచేశారని అన్నారు మీరు నిజమైన హీరోలు అంటూ ప్రియాంక వారిని కొనియాడారు.

ఇలాంటి పరిస్థితుల్లో సమిష్టి కృషి అవసరమన్నారు ప్రియాంక. వారం రోజుల నుంచి ఎంతో మంది అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. సర్వస్వం కోల్పోయిన వారికి విరాళాలు ఇవ్వాలని కోరారు. మరోవైపు అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తుగా భావిస్తున్న లాస్ ఏంజెల్స్ ప్రాంతంలో మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. పొడి వాతావరణం అగ్నికి ఆజ్యం పోస్తుండగా.. కార్చిచ్చు విస్తరిస్తూనే ఉంది. ఆ ప్రాంతాన్ని అగ్ని చుట్టుముట్టి బూడిదగా మార్చేస్తోంది.

వారం దాటింది.. కానీ లాస్ ఏంజెల్స్ కార్చిచ్చు దాహం మాత్రం ఇంకా చల్లారలేదు. అగ్నిమాపక సిబ్బంది, అధికారులు మంటలను కంట్రోల్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా నిరంతరం కృషి చేస్తున్నారు. మరోవైపు మంటల కారణంగా 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉంటే.. 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన ప్రియాంక చోప్రా.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వరస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 2018లో ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకుని హాలీవుడ్‌కి మకాం మార్చారు. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక హాలీవుడ్ చిత్రాలపై దృష్టి పెట్టారు. సిటాడెల్ సీజన్-1 వెబ్ సిరీస్ లో నటించిన ప్రియాంక.. ప్రస్తుతం సీజన్2తో బిజీగా ఉన్నారు.

మహేష్ బాబు హీరోగా రాజమౌళి SSMB29 అనే భారీ సినిమాను తెరకెక్కించబోతున్నారు. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందించబోతున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా నటించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.


Tags:    

Similar News