Saif Ali Khan Attacked: బాలీవుడ్ హీరోలపై పెరుగుతున్న దాడులు.. ఇంతకీ సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసింది దొంగేనా?
Saif Ali Khan Attacked: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతనిపై దాడి చేసి పారిపోయాడు.
Saif Ali Khan Attacked: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి జరిగింది. గురువారం తెల్లవారుజామున సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి చొరబడిన ఓ దొంగ అతనిపై దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో సైఫ్ అలీఖాన్‌కు ఆరు చోట్ల కత్తిపోట్లు పడ్డాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు.
సైఫ్ అలీఖాన్ పై దాడి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని తన నివాసంలో ఓ దొంగ సైఫ్ అలీఖాన్ పై దాడికి దిగాడు. అర్థరాత్రి ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తి ఇంట్లో దొంగతనం చేసి పారిపోతుండగా పనిమనిషికి చిక్కాడు. దీంతో దొంగకు, పనిమనిషికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో ఇంట్లో నిద్రపోతున్న సైఫ్ వెంటనే లేచి పనిమనిషిని కాపాడేందుకు ప్రయత్నించగా.. దుండగుడు కత్తితో సైఫ్ పై ఎటాక్ చేశాడు. ఆరు సార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం లీలావతి ఆస్పత్రికి తరలించారు. అయితే సైఫ్ అలీఖాన్ భార్య కరీనా కపూర్ లేని టైమ్ లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఘటనపై ముంబై పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తికి ఆ ఇళ్లు గురించి బాగా తెలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ స్టార్ హీరో కాబట్టి ఎప్పుడూ సెక్యూరిటీ ఉంటుంది. పైగా ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలుంటాయి. ఆ ఇంట్లో దొంగతనం చేసేందుకు ఎవరూ అంత పెద్ద సాహసం చేయరు. ఇదంతా తెలిసినవాళ్ల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కరీనా లేని టైమ్ చూసి సైఫ్ ఒక్కడే ఉన్నాడని తెలిసే ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2012లో వివాహం చేసుకున్న కరీనా, సైఫ్.. ముంబైలోని బాంద్రా వెస్ట్‌లోని సద్గురు శరణ్ భవనంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు-తైమూర్(8), జెహ్ (4).
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యంపై లీలావతి ఆస్పత్రి డాక్టర్లు కీలక ప్రకటన చేశారు. ఆరు కత్తిపోట్లతో ఆస్పత్రిలో చేరిన సైఫ్ అలీఖాన్‌కు సుమారుగా రెండు గంటలకు పైగా కాస్మెటిక్ సర్జరీ చేసినట్టు చెప్పారు. ఈ సర్జరీలో సుమారు 2-3 అంగుళాల పొడవు ఉన్న ఓ వస్తువును బయటకు తీశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఎలాంటి ప్రమాదం లేదన్నారు. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వెల్లడించారు. దీంతో సైఫ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలియగానే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు ట్వీట్స్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై జరిగిన దాడి ఘటనపై టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. సైఫ్ పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యానని ఎన్టీఆర్ ట్విట్టర్‌లో తెలిపారు. సైఫ్ అలీఖాన్ త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా చిత్రం దేవరలో సైఫ్ విలన్ గా నటించారు.
ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరోలకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. కృష్ణజింకలను వేటాడిన కేసు నేపథ్యంలో ఇప్పటికే పలుసార్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. గతేడాది సల్మాన్ నివాసం ఉంటున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ తన నివాసానికి బుల్లెట్ ప్రూఫ్ గ్లాసుతో కప్పేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. అంతేకాదు సల్మాన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కొనుగోలు చేసినట్టు కూడా వార్తలు వచ్చాయి. రూ.2 కోట్లు విలువైన ఆ కారును దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నారని టాక్.
గతకొద్ది రోజుల క్రితం నటుడు షారూక్ ఖాన్ పై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. పోలీసు ల్యాండ్ లైన్ నంబర్ కు ఫోన్ చేసి షారూక్ ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఛత్తీస్ గఢ్‌లోని రాయ్‌పూర్ నుంచి కాల్ వచ్చినట్టు గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. గతంలో సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ పై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఇప్పుడు సైఫ్ అలీఖాన్ పై కత్తితో దాడి చేయడం బాలీవుడ్ లో కలకలం రేపుతోంది.