Ajith Kumar: సికింద్రాబాద్ టూ కోలీవుడ్.. అంచెలంచెలుగా ఎదిగిన అజిత్

Ajith Kumar: అజిత్ బైక్, కారు మాత్రమే కాదు విమానాలు సైతం నడపగలరు. ఫైటర్ జెట్ లైసెన్స్ ఉన్న ఏకైక హీరో అజిత్.

Update: 2025-01-15 18:02 GMT

Ajith Kumar: సికింద్రాబాద్ టూ కోలీవుడ్.. అంచెలంచెలుగా ఎదిగిన అజిత్

హీరో అజిత్.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇన్నాళ్లు వెండితెరపై హీరోగా తనదైన నటనతో అలరించిన అజిత్. ఇప్పుడు దుబాయ్ 24 గంటల రేసులో మూడో సానంలో నిలిచారు. దీంతో ప్రస్తుతం దేశం మొత్తం హీరో అజిత్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అజిత్ హీరోనే కాదు.. రేసర్, ఫైలట్, చెఫ్, ఫొటోగ్రాఫర్ కూడాను. చిన్నప్పటి నుంచి ఆటోమొబైల్స్ పై ఆసక్తి పెంచుకున్న ఆయన రేసింగ్ లో ఎన్నో విజయాలు సాధించారు.


హీరో అజిత్ గురించి చెప్పక్కర్లేదు.. విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా ఎదిగిన అజిత్ షూటింగ్ నుంచి కాస్త బ్రేక్ దొరికినా చాలు బైక్ పై ప్రపంచాన్ని చుట్టేందుకు రెడీ అవుతారు. తాజాగా దుబాయ్ లో అజిత్ సరికొత్త ఘనత సాధించారు. దుబాయ్ 24 గంటల రేసింగ్‌లో అజిత్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది.


అజిత్‌కు సొంత రేసింగ్ కంపెనీ ఉంది. బైక్ పై అనేక దేశాలను చుట్టేశారు. హీరోగా సినీరంగంలోకి రాకముందే ఆటోమొబైల్ అంటే విపరీతమైన ప్రేమ ఉండేది. చదువు మధ్యలోనే ఆపేసిన ఈ సికింద్రాబాద్ కుర్రాడు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఓ బైక్ గ్యారేజీలో పనిచేశారు. ఆ తర్వాత నటన వైపు ఆసక్తి కలగడంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. కానీ, ఇప్పటికీ తనకు ఇష్టమైన రేసింగ్ మాత్రం వదిలిపెట్టలేదు. సినిమాలు, ఫ్యామిలీ కారణంగా కొన్నాళ్లపాటు రేసింగ్ నుంచి బ్రేక్ తీసుకున్న అజిత్ ఇప్పుడు మళ్లీ రేసింగ్ స్టార్ట్ చేశారు.


మామూలుగా ఎవరైనా గంటకు 100 కి.మీ, 150 కి.మీ వేగంతో వాహనాన్ని నడుపుతారు. కానీ అజిత్ మాత్రం గంటకు 300 కి.మీ.స్పీడ్ తో కారును నడుపుతారు.అంత వేగంగా కారును నడిపినా ఆయన కారును కంట్రోల్ చేస్తారు. బజారుకు వెళ్లి కూరగాయలు తెచ్చినంత ఈజీగా పుణె టు చెన్నై, హైదరాబాద్ టు చెన్నై కి ఆయన వెళ్లి వస్తారు.


తన 18వ ఏట ప్రారంభమైన ఈ అలవాటు దేశ, విదేశాల్లో జరిగే రేసుల్లో పాల్గొనేలా చేసింది.రేసుల్లో పాల్గొన్న అజిత్ ప్రమాదాల్లో గాయపడ్డారు. దీంతో ఆయనకు 15 సర్జరీలు, 5 వెన్నెముక గాయాలయ్యాయి. అయినా కూడా ఆయన రేసింగ్ ఆపలేదు. ఇటీవల రేసింగ్ లో ఉండగా ప్రమాదానికి గురయ్యారు. కానీ ఈ ఘటనలో సురక్షితంగా బయటపడ్డారు.


అజిత్ బైక్, కారు మాత్రమే కాదు విమానాలు సైతం నడపగలరు. ఫైటర్ జెట్ లైసెన్స్ ఉన్న ఏకైక హీరో అజిత్. చెన్నై ఫ్లయింగ్ క్లబ్‌లో ప్రాక్టీస్ చేస్తుంటారు. అంతేకాదు అజిత్ మంచి షూటర్. అతడికి షూటింగ్‌లో లైసెన్స్ కూడా ఉంది. షూటింగ్ కోసం జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. తమిళనాడు షూటింగ్ ఛాంపియన్‌షిప్ లో ఆరు పతకాలు సాధించారు. చెస్ ఆటలో కూడా ఆయనకు పట్టుంది.

అజిత్ వీటన్నింటికి మించి మంచి ఫిలాసఫర్. డబ్బుల కోసం పిచ్చి ప్రకటనలు చేయరు. తన ఇంట్లో పనిచేసే వాళ్లకు సొంతంగా ఇల్లు కట్టించి ఇచ్చారు. పార్టీలకు, పబ్బులకు వెళ్లరు. గాసిప్‌లకు దొరకరు. పేరు చివర స్టార్‌లు, బిరుదులు వద్దంటారు. ఇతరులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోరు. నీ హీరోకు జై కొడుతూ ఉంటే నువ్వెప్పుడు పైకి వస్తావంటూ సాటి అభిమానిని ప్రశ్నిస్తారు. మెకానిక్ గా జీవితం ప్రారంభించిన అజిత్.. అంచెలంచెలుగా ఎదిగారు.


కుటుంబం కోసం ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. అందుకే షూటింగ్స్ నుంచి కాస్త బ్రేక్ దొరికితే తన ఫ్యామిలీతో గడిపేందుకు ఇష్టపడుతుంటారు. ప్రస్తుతం అజిత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. అతడు నటించిన విదాముయార్చి సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.


Full View


Tags:    

Similar News