Saif Ali Khan Health Bulletin: వెన్నెముక నుంచి కత్తి మొన తీసిన డాక్టర్లు..!
Saif Ali Khan Health Bulletin: బాలీవుడ్ హిరో సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నంతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Saif Ali Khan Health Bulletin: బాలీవుడ్ హిరో సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నంతో ముంబై ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల ప్రాంతంలో సైఫ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సైఫ్ కుమారుడి రూంలోకి వెళ్లిన ఆగంతకులను గమనించిన పనిమనుషులు గట్టిగా అరవడంతో... దుండగులను పట్టుకునే ప్రయత్నం చేశాడు సైఫ్ అలీఖాన్. దీంతో తమ వెంట తెచ్చుకున్న కత్తులతో సైఫ్ అలీఖాన్‌పై దాడి చేసి గాయపరిచారు. వెంటనే అతడిని ఆటోలో లీలావతి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. వెన్నుముకతో పాటు మెడ, ఎడమచేతిపై గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. వెన్నుముకలో రెండున్నర ఇంచులు మేర కత్తి ఉండిపోయిందని... దానిని సర్జరీ చేసి తొలగించామన్నారు. మెడకు ప్లాస్టిక్ సర్జరీ చేశామన్నారు. సర్జరీ అనంతరం ఐసీయూకి తరలించి అబ్జర్వేషన్లో ఉంచామన్నారు. కోలుకున్న వెంటనే డిశ్చార్జీ చేస్తామని వెల్లడించారు.
సైఫ్ ఇంట్లోకి ఆగంతకులు మెట్ల మార్గంలో వచ్చారని డీఎస్పీ దీక్షిత్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.