Daku Maharaj Collections: 100 కోట్ల క్లబ్‌లోకి డాకు మహారాజ్.. బాలయ్య ఖాతాలో మరో రికార్డు..!
Daku Maharaj Collections: నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
Daku Maharaj Collections: నందమూరి బాలకృష్ణ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన డాకు మహారాజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. నాలుగు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.105 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్ మెంట్ వెల్లడించింది. కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసింది. డాకు మహారాజ్‌కు మొదటి రోజు అంటే జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.56 కోట్లకు పైగా వసూళ్లు రావడంతో బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది.
సితారా ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ కథానాయికలుగా నటించారు. వరుస హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలయ్య చేసిన సినిమా కావడంతో అభిమానులు ఎంతగానో అంచనాలు పెంచుకున్నారు. అయితే అభిమానులు ఆశించినట్టే.. ఈ సినిమా తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
బాలకృష్ణ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యున్నత స్థానంలో ఉన్నారు. ఓ వైపు వరస సక్సెస్‌లు.. అటు అన్ స్టాపబుల్ షోతో కెరీర్ పరంగా పీక్స్‌లో ఉన్నారు. హీరోగా వరుస సక్సెస్‌లు.. హోస్ట్‌గా డబుల్ సక్సెస్ అందుకున్నారు. మరోవైపు పొలిటికల్‌గానూ రాణిస్తున్నారు. ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన అఖండ మూవీతో తొలిసారి రూ.100 కోట్ల క్లబ్బులో ప్రవేశాంచారు బాలకృష్ణ.. ఆ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హాట్రిక్ సక్సెస్ బాలయ్య ఖాతాలో నమోదయింది. ఇప్పుడు డాకు మహారాజ్‌తో మరోసారి రికార్డ్ క్రియేట్ చేశారు బాలకృష్ణ.
తెలుగులో సీనియర్ హీరోల్లో చిరంజీవి నాలుగు రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన చిత్రాలున్నాయి. తాజాగా ఆ రికార్డును బాలయ్య సమం చేశారు. అంతేకాదు 60 ఏళ్ల వయస్సులో నాలుగు హిట్స్ అందుకోవడంతో పాటు వరుసగా నాలుగు రూ.100 కోట్ల గ్రాస్ అందుకున్న సీనియర్ స్టార్‌గా నిలిచారు. రజనీకాంత్, మోహన్ లాల్, చిరంజీవి, ముమ్మట్టి వంటి హీరోలు 60 ఏళ్ల వయస్సులో విజయాలు అందుకున్నా.. వరుసగా మూడు, నాలుగు హిట్ చిత్రాలు లేవు. కానీ బాలయ్య మాత్రం వరుసగా నాలుగు విజయాలతో వరల్డ్ రికార్డు క్రియేట్ చేశారు.
ఇక తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డాకు మహారాజ్ చిత్రాన్ని జనవరి 17వ తేదీన తమిళంలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన డాకు మహారాజ్ సినిమా తమిళంలో ఏ మేరకు అరిస్తుందో చూడాలి మరి.