వైసీపీ ఎంపీ విజయ సాయి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. స్వలాభాల కోసం సీఎం చంద్రబాబు గురించి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శించారు.
బెంగళూరులో ఆదినారాయణ రెడ్డి క్లబ్ లు నడుపుతున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఆదినాయణ రెడ్డి తనపై విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే ఉరివేసుకుంటానని సవాల్ చేశారు. ఆయన గలీజు.. గబ్బు వ్యక్తి అన్నారు. మతిభ్రమించి గతి తప్పాడని మండిపడ్డారు.
అంతేకాదు జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 ముద్దాయిగా ఉన్న విజయసాయి తన కేసుల నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. పీఎం మోడీ కాళ్లమీద్దపడ్డా ఆయనను కాపాడలేరని వ్యాఖ్యానించారు. పనిలో పనిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు చేశారు. పవన్ సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటివాడన్నారు. ఆయనతో తమకు ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డారు.
మరోవైపు ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. విజయసాయి కాదు చంద్రబాబే మోడీ కాళ్లు పట్టుకున్నారని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అలా అనే సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తున్నాయని సూచించారు.
నరేంద్ర మోడీ, అరుణ్ జైట్లీలతో సుజనా చౌదరి లాబీయింగ్ కరెక్ట్ కాదా అని వెల్లంపల్లి విమర్శించారు. బెజవాడలో బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్‌లు జోకర్లు అన్నారు. అమ్మను కార్పోరేటర్ చేయలేని బుద్దా వెంకన్న ఏం చేసి ఎమ్మెల్సీ, విప్ తెచ్చుకున్నారో అందరికీ తెలుసునని చెప్పారు.