Tirumala-Vaikunta Ekadasi: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి.. తొక్కిసలాట ఘటనతో భారీ ఏర్పాట్లు
Tirumala-Vaikunta Ekadasi: తిరుమలలో తొక్కిసలాట ఘటనతో అలర్ట్ అయిన టిటిడి రేపు వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అపశృతి జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు టిటిడి తెలిపింది. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. అలాంటిది వైకుంఠ ద్వారం ద్వారా వెళ్లి అత్యంత దగ్గర నుంచి శ్రీవారిని దర్శించుకుంటే ఆ ఆనందం మాటలకు అందదు. అందుకే శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు టీటీడీ పూర్తి ఏర్పాట్లు చేస్తుంది. ఇలా పది రోజుల పాటు ఈ ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు చేసింది టీటీడీ.
శ్రీవారి ఆలయాన్ని రోజు ఒక గంట మాత్రమే మూసి ఉంచుతారు. మిగతా 23 గంటలు స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తూనే ఉంటారు. శుక్రవారం ఉదయం ముందుగా శ్రీవారి ఆలయాన్ని తెరిచిన తర్వాత ఏకాంతంగా స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఏకాంతంగా అభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఉదయం 4:30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు.ఈ సమయంలో ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవు. వైకుంఠ ద్వార దర్శన సమయంలో అంటే జనవరి 19 వరకు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ .
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఏడుకొండలను అత్యంత అందంగా తీర్చిదిద్దింది టిటిడి. దాదాపు 12 టన్నుల పూలను తీసుకువచ్చే శ్రీవారి ఆలయంతో పాటు, చుట్టుపక్కల ఆలయాలను అలంకరించారు. పూలతోపాటు పండ్లతోనూ రకరకాల కళారూపాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం మైసూర్ కి చెందిన నిపుణులు వచ్చి అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం బయట శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక తిరుమలలో లైటింగ్, ఎలక్ట్రిసిటీ కూడా సరికొత్తగా మార్చారు. ఘాటు రోడ్లలపై కూడా అదనపు జాగ్రత్తలు తీసుకుంటుంది టిటిడి.
శ్రీవారి భక్తులు గోవిందమాలతో ఇరుముడిలో చెల్లిస్తుంటారు. వారి కోసం ఆలయం బయట హుండీలను ఏర్పాటు చేసింది టీటీడీ. అలాగే వాహన మండపంలో శ్రీదేవి, భూదేవితో ఉన్న మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ విగ్రహాల్ని చూసి తరించేలా ఏర్పాటులు పూర్తి చేశారు.
ఇక ఇండియాలో హెచ్ఎంపీవీ వ్యాధి యాక్టివ్ గా ఉంది కాబట్టి భక్తులు మాస్కులు ధరించి శ్రీవారి దర్శనానికి వెళ్లాలని టీటీడీ సూచించింది. టోకెన్లు ఉన్నవారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని నాయుడు తెలిపారు. అలాగే 10 రోజులపాటు సిఫార్సు లేఖలను కూడా తీసుకునేది లేదని తెలిపారు.
కాగా గురువారం నుంచి తిరుపతిలోని ఎనిమిది కేంద్రాల్లోని 90 కౌంటర్లలో టోకెన్లు ఇస్తున్నారు. తిరుమలలో ఒక కేంద్రంలోని నాలుగు గంటల తిరుమల స్థానిక భక్తులకు టోకెన్లు ఇస్తున్నారు. వారు 10, 11, 12 తేదీల్లో మొత్తం 1.20 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు పొందవచ్చు. అలాగే 13 నుంచి 19 తేదీ వరకు ఇచ్చే టోకెన్లు ఏ రోజుకు ఆ రోజు ఇస్తారు.
ఉత్తర వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ప్రోటోకాల్ లో ప్రముఖులకు మాత్రమే ప్రత్యేక దర్శనానికి అనుమతిస్తారు. వారు కాకుండా విఐపి బ్రేక్, చంటి పిల్లలతో వచ్చేవారు, దివ్యాంగులు, ముసలివారు, ఎన్నారైలకు ఈ పది రోజులు ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.