Tirupati stampede: డీఎస్పీ గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
Tirupati stampede: శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర దురద్రుష్టవశాత్తూ ఆరుగురు భక్తులు మరణించడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
తర్వాత చైర్మన్ మీడియాతో మాట్లాడారు. ఒక సెంటర్ లో మహిళా భక్తురాలు అపస్మారకస్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారు. దీంతో ఒక్కసారిగా భక్తులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట చోటుచేసుకుని భక్తులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. మరో 25 మంది వరకు క్షతగాత్రులు ప్రభుత్వ రుయా, స్విమ్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆయన వివరించారు.
టెలీకాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి అధికారులపై తీవ్ర అసంత్రుప్తి వ్యక్తం చేశారని బీఆర్ నాయుడు తెలిపారు. అధికారుల వైఫల్యంతోనే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారని..ఇలాంటి ఘటన లు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
తిరుపతిలో పరిస్థితిని ఈవో జె. శ్యామలరావు, కలెక్టర్ వెంకటేశ్వర్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని..ప్రమాదవశాత్తూ మాత్రమే జరిగిందని తెలిపారు. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి వస్తారని..మరణించినవారికి సంతాపం తెలపడంతోపాటు క్షతగాత్రులను పరామర్శిస్తారని తెలిపారు.
మరణించినవారి కుటుంబాలకు పరిహారం కూడా ప్రకటించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన రుయా ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న వారిని ఛైర్మన్ పరామర్శించారు.