Chandrababu Security : సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పులు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్..!
Chandrababu Naidu Security: సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి.
Chandrababu Naidu Security: సీఎం చంద్రబాబు భద్రతలో మార్పులు జరిగాయి. మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. నిఘా హెచ్చరికలతో స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్‌లో మార్పులు-చేర్పులు చేస్తున్నారు. సీఎం భద్రతా వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్స్‌ను దింపుతున్నారు. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా.. ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఎస్పీజీ ఆధ్వర్యంలో కౌంటర్ యాక్షన్ టీమ్‌కు శిక్షణ ఇస్తున్నారు.
చంద్రబాబుకు మూడంచెల భద్రత కల్పిస్తారు.. ఎన్‌ఎస్‌జీ తొలి, ఎస్ఎస్‌జీ రెండు వలయాల్లో సెక్యూరిటీని కల్పిస్తాయి. మూడో వలయంగా సీఎం పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి పోలీసు యూనిట్లకు చెందిన సాయుధ బలగాలు భద్రతను ఇస్తాయి. వీరితో పాటుగా ఇప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి సమీపంలో ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు సెక్యూరిటీగా ఉంటారు. ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ ముఖ్యమంత్రిని రక్షించి సురక్షితంగా ఉండే ప్రాంతానికి తీసుకెళతారు. ఈలోపు కౌంటర్ యాక్షన్ టీమ్ బయటి నుంచి దాడి చేసే వారిని ఎదుర్కొంటుంది. ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) ఈ కౌంటర్ యాక్షన్ కమాండోలకు శిక్షణను ఇచ్చాయి.
దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీ ఉన్న అతికొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. తిరుపతిలోని అలిపిరి వద్ద ఆయనపై నక్సల్స్ దాడి చేసిన తర్వాత ఆయనకు ఎన్‌ఎస్‌జీ బ్లాక్ క్యాట్ కమాండోలు వచ్చారు. ఈ బ్లాక్ క్యాట్ కమాండోలతో పాటు చంద్రబాబుకు భద్రతా వలయం కూడా ఎప్పుడూ కూడా కట్టుదిట్టంగా ఉంటుంది.