PM Modi to AP: నేడు విశాఖకు ప్రధాని నరేంద్ర మోదీ..షెడ్యూల్ ఇదే

Update: 2025-01-08 00:59 GMT

PM Modi to AP: ప్రధాని నరేంద్రమోదీ నేడు ఏపీలోని విశాఖపట్నంకు వస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన విశాఖ రైల్వే జోన్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీకి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ చూద్దాం.

-బుధవారం సాయంత్రం 4.15కి ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకుంటారు.

- సాయంత్రం 4.45 నుంచి 5.30గంటల వరకూ రోడ్ షో ఉంటుంది.

- 5.30 నుంచి 6.45 వరకు ఆంధ్రా యూనివర్శిటీ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభ నుంచే వర్చువల్‌గా శంకుస్థాపనలూ, ప్రారంభోత్సవాలూ చేయనున్నారు. అనంతరం ఆయన ప్రసంగం ఉంటుంది.

-6.50కి అక్కడి నుంచి బయలుదేరి, విశాఖ ఎయిర్‌పోర్టుకి చేరుకుంటారు.

-రాత్రి 7.15కి విశాఖపట్నం నుంచి విమానంలో… ఒడిశా లోని భువనేశ్వర్‌కి వెళ్తారు.

విశాఖలోని రైల్వే జోన్ ప్రధాన కేంద్రం, పూడికమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, క్రిష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు బీబీనగర్ రైల్వే లైన్ డబ్లింగ్, గుత్తి పెండేకళ్లు రైల్వే లైన్ డబ్లింగ్ వంటి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఇంకా 16వ నెంబర్ హైవేలో చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ రోడ్డును జాతికి అంకింతం చేస్తారు. నేషనల్ హైవేలు, రైల్వే లైన్లను వర్చువల్ గా ప్రారంభిస్తారు ప్రధాని మోదీ.

ఈ టూర్ పై ప్రధాని మోదీ ఆసక్తితో ఉన్నారని బీజేపీ నేతలు తెలిపారు.దీనిపై మంగళవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని ఏర్పాట్లపై ఆరా తీశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండగా అందులో బీజేపీ భాగమై ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి ఏపీ కీలక రాష్ట్రంగా మారింది. ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రధాని మోదీ నేడు మాత్రమే కాదు ఈ నెల 20వ తేదీ వరకు కూడా రకరకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వర్చువల్ గా చేయనున్నారు.

ప్రధాని టూర్ ఏపీ ప్రభుత్వానికి మరింత కలిసిరానుంది. పెట్టుబడులను పెట్టాలనుకునేవారు కేంద్రం కూడా ఏపీ పట్ల ఆసక్తిగా ఉందనే ఆలోచన వచ్చేందుకు ప్రధాని పర్యటన ఉపయోగపడుతుంది. అందుకే ఇప్పటికే వస్తున్న పెట్టుబడులకు తోడు..మరిన్ని వచ్చేందుకు ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News