JC Prabhakar Reddy's apology to Madhavilatha: సినీనటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆరోజు అలా అనడం తప్పేనని, అందుకే ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు ఆవేశంలో అన్న మాటలేనని తెలిపారు. పొరపాటున ఆవేశంలో నోరుజారానని అంగీకరించారు. ఆ కారణంతోనే తాను ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఇంతకీ మాధవీ లత ఏమన్నారు?
తాడిపత్రిలోని జేసీ పార్క్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలపై మాధవీలత సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ... జేసీ పార్క్ పరిసరాల్లో పనికిమాలిన వాళ్లు గంజాయి తాగుతూ ఉంటారని, అక్కడికి వెళ్తే మహిళలు సురక్షితంగా ఎలా తిరిగొస్తారని ప్రశ్నించారు. మహిళలే తమ భద్రత గురించి ఆలోచించుకోవాలని మాధవీలత మహిళా లోకానికి సూచించారు. మహిళలకు ఏదైనా జరిగితే మీ జీవితానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారని అన్నారు. దయచేసి జేసీ పార్కులో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లకూడదని ఆమె పిలుపునిచ్చారు.
మాధవీలత మాటలకు జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్
బతుకుదెరువు కోసం పాకులాడే వాళ్లతో మా ఊరి మహిళల భద్రత గురించి మీరు చెప్పిస్తారా అంటూ మాధవీలత గురించి తక్కువ చేసి మాట్లాడారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఆ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు... సినిమాలు చేసుకునే మహిళల పట్ల జేసి ప్రభాకర్ రెడ్డి వైఖరి ఇదేనా అనే విమర్శలు కూడా వచ్చాయి. దీంతో ఈ వివాదంపై ఆఖరికి జేసి ప్రభాకర్ రెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.