Free Bus Scheme in AP: కర్ణాటకలో ఏపీ మంత్రులు.. ఫ్రీ బస్సు ప్రయాణంపై ఆరా..!
Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది.
Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు పథకంపై ఏపీలోని మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఉపసంఘం సభ్యులు కర్ణాటకలో పర్యటిస్తున్నారు. కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి సహా అధికారులతో వారు సమావేశమయ్యారు. ఈ మేరకు బెంగళూరులో కర్ణాటక మంత్రిని ఏపీ మంత్రులు రాంప్రసాద్ రెడ్డి, అనిత, సంధ్యారాణి కలిశారు. ఆ రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంపై అధ్యయనం చేశారు. కర్ణాటక బస్సుల్లో ప్రయాణిస్తూ మంత్రుల కమిటీ వివరాలు అడిగితెలుసుకుంది.
కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలవుతోంది. దీంతో ఈమూడు రాష్ట్రాలకు వెళ్లి అక్కడ అమలు విధానం, క్షేత్రస్థాయి ఇబ్బందులు పరిశీలించి రావాలని సీఎం చంద్రబాబు తాజాగా దీని అమలుపై ఏర్పాటైన మంత్రుల కమిటీలో సభ్యులకు సూచించారు. దీంతో మంత్రుల బృందం కర్ణాటక వెళ్లింది.
ఏపీలో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని టీడీపీ-జనసేన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచి ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని టీడీపీ కూటమి సర్కార్ చెప్తోంది. అందుకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటోంది. ఉచిత బస్సు పథకం సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే ఈ పథకం అమలవుతున్న రాష్ట్రాల్లోని విధానాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది.