JC Prabhakar Reddy: మీ కంటే జగనే నయం కదా.. మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు

JC Prabhakar Reddy: న్యూఇయర్ సందర్భంగా మహిళలతో నిర్వహించిన ఈవెంట్ టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది.

Update: 2025-01-03 06:54 GMT

JC Prabhakar Reddy: మీ కంటే జగనే నయం కదా.. మాధవీలతపై వివాదాస్పద వ్యాఖ్యలు

JC Prabhakar Reddy: న్యూఇయర్ సందర్భంగా మహిళలతో నిర్వహించిన ఈవెంట్ టీడీపీ, బీజేపీ మధ్య చిచ్చు పెట్టింది. బీజేపీ నాయకులపై సినీ నటి మాధవిలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీ కంటే జగనే మేలు అంటూ ఆయన బీజేపీపై మండిపడ్డారు.

అసలు ఏం జరిగింది?

న్యూఇయర్ ను పురస్కరించుకొని తాడిపత్రిలో జేసీ పార్క్ లో మహిళలతో ఈవెంట్ నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి వెళ్లొద్దని సినీ నటి మాధవీలత కోరారు.

ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి పార్క్ సమీపంలో గంజాయి బ్యాచ్ తిరుగుతుందని మహిళలు ఈ కార్యక్రమానికి వెళ్లి ఇబ్బందులు పడవద్దని ఆమె కోరారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.

ఆమెకు మద్దతుగా మరో బీజేపీ నాయకురాలు సాదినేని యామినిశర్మ కూడా మరో వీడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమం సంప్రదాయాలకు విరుద్దమన్నారు. ఎలాంటి సంప్రదాయాలకు తెరతీస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇవి కాపురాల్లో చిచ్చు పెట్టేందుకు కారణమౌతాయని కూడా ఆమె ఆరోపించారు. స్థానిక ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి నిర్వహించిన న్యూ ఇయర్ ఈవెంట్ ను వ్యతిరేకించారు.దీనికి హాజరు కావొద్దని మహిళలను కోరారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమానికి మహిళలు హాజరయ్యారు. మహిళలతో జేసీ ప్రభాకర్ రెడ్డి డ్యాన్స్ చేశారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు.

బస్సుల దగ్దంపై జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాడిపత్రిలో నిలిపి ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన బస్సులు జనవరి 1న తెల్లవారుజామున దగ్దమయ్యాయి. చాలా కాలంగా ఈ బస్సులు అక్కడే పార్క్ చేసి ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా బస్సులు దగ్దమయ్యాయని భావించారు. అయితే దీని వెనుక కుట్ర ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దీని వెనుక బీజేపీ నాయకులున్నారని ఆయన ఆరోపించారు. మీ కంటే జగనే నయమని వ్యాఖ్యానించారు. మాధవీలత చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. సాదినేని యామినిపై కూడా ఆయన మండిపడ్డారు.

మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్ల ఫిర్యాదు

మాధవీలతపై టీడీపీ కౌన్సిలర్లు డిసెంబర్ 2న రాత్రి సీఐకు ఫిర్యాదు చేశారు. తాడిపత్రిలోని మహిళలను కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆమెపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. మహిళలను కించపర్చినందును ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News