Vangalapudi Anitha: ఏపీ హోంమంత్రి అనిత పీఏ జగదీశ్ పై వేటు
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న సంధు జగదీశ్ ను తొలగించారు.
Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వద్ద ప్రైవేట్ పీఏగా పనిచేస్తున్న సంధు జగదీశ్ ను తొలగించారు. బదిలీలు, పోస్టింగులు, సిఫారసుల కోసం అక్రమ వసూల్లకు పాల్పడుతున్నారని ఆయనపై ఆరోపణలు రావడంతో ఆయనను పక్కకు తప్పించారు. అనిత వద్ద జగదీశ్ పదేళ్లుగా పీకా పనిచేస్తున్నారు. హోంమంత్రిగా అనిత బాధ్యతలు చేపట్టిన తర్వాత జగదీశ్ పై ఆరోపణలు వచ్చాయి. జగదీశ్ పై ఆరోపణల విషయం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. దీంతో జగదీశ్ ను తొలగించారు. జగదీశ్ ను పీఏగా తప్పించిన విషయాన్ని అనిత పాయకరావుపేట టీడీపీ కార్యకర్తల సమావేశంలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడిచింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రుల పనితీరుపై చంద్రబాబు మాట్లాడారు.ఎవరి పనితీరు ఎలా ఉందనే దానిపై తన వద్ద సమాచారం ఉందని చెప్పారు. పనితీరు మార్చుకోవాలని కొందరికి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. పనితీరును బట్టే పదవులుంటాయనే విషయమై చంద్రబాబు మంత్రులకు తేల్చి చెప్పారు. ఈ దఫా కొత్తవారికి చంద్రబాబు తన కేబినెట్ లో అవకాశం కల్పించారు. పార్టీ అవసరాల రీత్యా కేబినెట్ లో యువకులకు చోటు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రులుగా కొందరి వ్యవహరశైలి ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తోందనే ఆరోపణలున్నాయి. దీంతో చంద్రబాబు నష్టనివారణ చర్యలకు దిగారు.
మంత్రుల పేషీల్లోని సిబ్బందిపై సీఎంకు ఇంటలిజెన్స్ నివేదికలు
రాష్ట్రంలోని మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబుకు ఇంటలిజెన్స్ నివేదికలు తయారైనట్టుగా ప్రచారం సాగుతోంది.ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి పేషీపై ఆరోపణలున్నాయి. గుంటూరు ప్రాంతానికి చెందిన ఓ మంత్రిపై ఆరోపణలున్నాయి.
కోనసీమకు చెందిన మంత్రి సిబ్బందిపై సీఎం వద్ద ఫిర్యాదులున్నాయి. టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఫిర్యాదులు పార్టీ నాయకత్వానికి వెళ్తున్నాయి. మరో వైపు ఇదే విషయమై సమయం దొరికినప్పుడు చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. తాజాగా హోంశాఖ మంత్రి పీఏ అనితపై వేటు పడిన నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొంత మందిపై వేటు పడే అవకాశం ఉంది.