ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తి వెనక్కి..!

తల్లిదండ్రుల నుంచి ఆస్తిని రాయించుకుని వాళ్ల బాగోగులు పట్టించుకోని కొడుకుల భరతం పట్టేలా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Update: 2025-01-08 09:58 GMT

తల్లిదండ్రుల నుంచి ఆస్తిని రాయించుకుని వాళ్ల బాగోగులు పట్టించుకోని కొడుకుల భరతం పట్టేలా ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వారసులు సరిగా చూడటం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారి ఆర్డీవోకు పిటిషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. తల్లిదండ్రుల ఫిర్యాదులో ఉన్నది నిజమని తేలితే రిజిస్టర్ డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్‌రిజిస్టార్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కనిపెంచిన తల్లిదండ్రులను కొందరు నడిరోడ్డుపై వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే.. ఒక్క ముద్ద అన్నం పెట్టలేక ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో వారు ఎక్కడి వెళ్లాలో తెలియక జీవితం చివరి రోజులను భారంగా నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్దులకు అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తిని తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కార్ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టార్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం.. ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగా చూడడం లేదని జిల్లా ట్రిబ్యూనల్ అధికారిగా ఉండే ఆర్డీవోకు పిటిషన్ ఇచ్చి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమని తేలితే ఆర్డీవో ఇచ్చే ఆదేశాల ఆధారంగా తల్లిదండ్రులు రాసిచ్చిన ఆస్తుల తాలుకా డాక్యుమెంట్లను సబ్ రిజిస్టార్ రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదికి బదిలీకానుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తాము తిన్నా, తినకున్నా పిల్లలకు కడుపునిండా పెడతారు. బిడ్డలకు చిన్నపాటి కష్టమొచ్చినా తట్టుకోలేరు. ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివిస్తారు. కానీ వారి రుణం తీర్చుకోవాల్సిన సమయంలో అది తమ బాధ్యత కాదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. వంతుల వారీగా తల్లిదండ్రులను పంచుకుంటున్నారు. తమ పిల్లలతో పాటు నాలుగు మెతుకులు పెట్టేందుకు కూడా భారంగా భావిస్తున్నారు. కొందరు ఇంటి నుంచి గెంటేస్తుంటే.. మరికొందరు వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఇటీవల వృద్ధాశ్రమాలు కూడా పెరిగిపోతున్నాయి.

మరికొందరు కొట్టినా, తిట్టినా తమ పిల్లల దగ్గరే జీవిస్తుంటారు. అయితే చివరి క్షణాల్లో వారు మంచి జీవితం అనుభవించేలా.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులను సరిగా చూసుకోకపోతే వారి ఆస్తిని తిరిగి తల్లిదండ్రులకు ఇచ్చే కీలక నిర్ణయం ఇది. ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పటికైనా అలాంటి వారికి కనువిప్పు కలుగుతుందో చూడాలి మరి.

Tags:    

Similar News