Tragedy in Tirupati: తిరుమల తిరుపతి దేవాస్థానంలో పెనువిషాదం నెలకొంది. వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల ప్రాణాలు కోల్పోయారు. మరో 48 మంది భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించినవారిలో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీరిని నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడు బాబు 51, విశాఖ పట్నానికి చెందిన రజిని 47, లావాణ్య 40, శాంతి 34, కర్నాటకలోకి బళ్లారికి చెందిన నిర్మల 50 లుకా గుర్తించారు. అంతకుముందే శ్రీనివాసం దగ్గర ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద అస్వస్థతకు గురై తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన మల్లిక 49 అనే మహిళ మరణించినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం కోసం తిరుపతిలోని 8 కేంద్రాల దగ్గర స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 10,11,12 తేదీలకు సంబంధించి మొత్తం 1.20లక్షల టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. 9వ తేదీ గురువారం ఉదయం 5గంటలకు టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
దీంతో బుధవారం ఉదయం నుంచే రాష్ట్రంతోపాటు పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్నాటకల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కేంద్రాల వద్దకు తరలివచ్చారు. బుధవారం సాయంత్రానికి భారీ సంఖ్యలో భక్తులు అక్కడ పోగయ్యారు. మొత్తం నాలుగు ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. మొదట జీవకోన వద్ద ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర స్వల్ప తొక్కిసలాట జరిగింది. రాత్రి 7 గంటల సమయంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు యత్నించినా తోసుకుంటూ లోపలికి వెళ్లి క్రమంలో ఈ తొక్కిసలా జరిగింది. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.