తిరుపతి సంఘటనపై చంద్రబాబు సీరియస్.. 'నో ఎక్స్‌ప్లినేషన్స్' అంటూ ఆగ్రహం
Chandrababu: తిరుపతిలోని తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు.
Tirupati Stampede: తిరుపతిలోని తొక్కిసలాట ఘటనను సీఎం చంద్రబాబు పరిశీలించారు. విజయవాడ నుంచి బయల్దేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వెళ్లారు. నగరంలోని బైరాగిపట్టెడ వద్ద ఘటనాస్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలను మంత్రులు, అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగా ఏర్పాట్లు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల రద్దీ పెరుగుతుంటే టీటీడీ అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని సక్రమంగా నెరవేర్చాలి తమాషాలు చేయొద్దన్నారు. రద్దీ చూసి టికెట్లు ఇవ్వాలని తెలియాదా? భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాక ఏం చేశారు.. అని నిలదీశారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో 2 వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎలా పెట్టారంటూ అధికారులను ప్రశ్నించారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదంటూ ఫైరయ్యారు. ఎప్పుడూ చేసినట్టే ఇప్పుడూ కూడా ఏర్పాట్లు చేశామని ఈవో చెప్పగా.. ఎవరో చేశారని.. మీరు కూడా అలానే చేస్తారా? మీకంటూ కొత్త ఆలోచనలు లేవా అంటూ సీరియస్ అయ్యారు.
సీఎం అడిగిన ప్రశ్నలకు స్పందించిన అధికారులు.. భక్తులు కూర్చున్నప్పుడు పరిస్థితి అంతా బాగానే ఉందని.. బయటకు వదిలేప్పుడు ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పిందని వివరణ ఇచ్చారు. దీంతో నో ఎక్స్‌ప్లేనేషన్స్ అంటూ చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా పలువురు గాయపడ్డారు. ఇక ఈ ఘటనపై ప్రతిపక్షాలు ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తున్నాయి.