Tirupati Tragedy: తిరుపతి వెళ్లనున్న సీఎం చంద్రబాబు..తొక్కిసలాట ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
Tirupati Tragedy: తిరుమలలో భారీ విషాదం నెలకొంది. వైకుంఠ దర్శనం టోకెన్ల కోసం ఏర్పాటు చేసిన భారీ క్యూలైన్లలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భక్తులు టోకెన్లు తీసుకునేందుకు ఒక్కసారిగా ఎగబడినట్లు సమాచారం. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 5 గురు భక్తులు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
కొనఊపిరితో ఉన్న క్షతగాత్రులను తిరుపతిలోని రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ, టీటీడీ ఈవో, జిల్లా కలెక్టర్, ఎస్పీలతో రివ్యూ చేసిన ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. విశాఖలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధ కలిగించిందని సీఎం అన్నారు. తాను నేడు గురువారం తిరుపతికి రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ముందు జాగ్రత్త చర్యలు విఫలకావడంపై అధికారులపై తీవ్ర అసంత్రుప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. భక్తులు అధికంగా వస్తారని తెలిసి కూడా ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. ఇలాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా, బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. మరణించినవారి సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.