Weather Report: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. రేపటి నుంచి మోస్తరు వర్షాలు
Weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.ఆగ్నేయ బంగాళాఖాతంలో స్థిరంగా బలపడుతుండగా.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం..క్రమంగా బలపడుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో జనవరి 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని..ఉరుములు, పిడుగులు కూడా పడతాయని ఐఎండీ అంచనా వేసింది. జనవరి 12వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరిలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి వర్ష సూచన చేయలేదు. అల్పపీడనం ఎటు వెళ్తుందనేదాన్ని బట్టీ ఈ అంచనాలు మారే అవకాశం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
ఇకశాటిలైట్ అంచనాల ప్రకారం నేడు తెలుగు రాష్ట్రాల్లో మేఘాలు వస్తూ పోతుంటాయి. రోజంతా వాతావరణం పొడిగానే ఉంటుందని..గాలుల వేగం పెరుగుతుందని ఐఎండీ తెలిపింది. అయితే చలి మాత్రం మరింత పెరుగుతుందని పేర్కొంది. బంగాళాఖాతంలో గాలి వేగం మరింతగా పెరిగింది. గంటకు 35కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఏపీలో ఇది గంటకు 17కిలోమీటర్లుగా ఉంటే..తెలంగాణలో గాలి వేగం గంటకు 15కిలోమీటర్లుగా ఉంది. రెండు రాష్ట్రాల్లో టూవీలర్లపై ప్రయాణించేవారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనుకోకుండా బలమైన గాలులు వీచే ప్రమాదం ఉందని తెలిపింది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చూసినట్లయితే పగటివేళ 27డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి 16డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఏపీలో పగటివేళ 30 డిగ్రీల సెల్సియస్ ఉంటే రాత్రి 18 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. మొత్తంగా తెలుగురాష్ట్రాల్లో అన్ని రకాలుగా వాతావరణం బాగుంటున్నప్పటికీ చలిగాలులు మాత్రం పెరిగే అవకాశం ఉంది. వీటిని రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.