Tirupati Stampede: మృతుల కుటుంబంలో ఒకరికి టీటీడీలో ఉద్యోగం.. ఫ్రీ దర్శనం.. చంద్రబాబు కీలక హామీ

Update: 2025-01-10 00:54 GMT

Tirupati Stampede: తిరుపతి వైకుంఠ ద్వార దర్శనాల కోసం టికెట్ల జారీ చేసే సమయంలో తొక్కిసలాట కారణంగా మరణించిన కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. మరణించిన వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పిస్తామని భరోసానిచ్చారు. దీంతో పాటుగా బాధితులకు పరిహారం కూడా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

తొక్కిసలాట కారణంగా గాయపడి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించి వారి కుటుంబాలను ఆదుకుంటామని మాట ఇచ్చారు. టీటీడీ ద్వారా మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. మరణించిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలట కారణంగా తిమ్మక్క, ఈశ్వరమ్మ తీవ్ర గాయాలు అయ్యాయని వారికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వీరితో పాటు తొక్కిసలాటలో గాయపడిన 33 మందికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నట్లు టిటిడి ఉన్నత అధికారులతో సమక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ విషయాలను వెల్లడించారు. ఎంతో దూరం నుంచి శ్రీనివాసుని దర్శనం కోసం వచ్చి గాయపడిన 35 మందికి శుక్రవారం వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామని చంద్రబాబు మాటిచ్చారు .

వైకుంఠ ద్వార దర్శనాల కోసం టికెట్లు తిరుపతిలోని శ్రీనివాసన్, సత్యనారాయణపురం, బైరాగి పట్టేడ, రామనాయుడు స్కూల్ దగ్గర ఏర్పాటుచేసిన కేంద్రాల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాట కారణంగా పుద్దేటి నాయుడు బాబు, నర్సీపట్నం కి చెందిన వ్యక్తి మరణించినట్లు అధికారులు గుర్తించారు. విశాఖకు చెందిన రజిని, లావణ్య, శాంతి, కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడు రాష్ట్రంలోని సేలం కు చెందిన మల్లిగా మృతులను గుర్తించారు.

ఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనకు ముఖ్య కారణం డీఎస్పీ రమణ కుమార్ బాధ్యత రహితంగా వ్యవహారించారని సీఎం అన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమణ కుమార్ తో పాటు గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఎస్పి సుబ్బారాయుడు, జేఈవో గౌతమి, సిఎస్ఓ శ్రీధర్ను తక్షణమే బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపి దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు.

Tags:    

Similar News