ఏపీలో ప్రతిపక్షం తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. పాలకపక్షం మీద పెరుగుతున్న వ్యతిరేకతనే ఆధారంగా చేసుకుని ఆపార్టీ సాగుతున్న తీరు చాలామందిని విస్మయానికి గురిచేస్తోంది. కేవలం అధికార పార్టీపై ఉన్న అసంతృప్తితోనే తాము అధికారంలోకి వచ్చేస్తామనే అభిప్రాయం విపక్ష నేతల్లో పెరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని, అదే తమకు చాలానే రీతిలో అతి విశ్వాసం వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను తమకు సానుకూలంగా మలచుకోవడంపై పెద్దగా దృష్టిపెడుతున్న దాఖలాలు లేవనే అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రజాసంకల్ప యాత్ర విషయంలోనూ ఇదే తీరు కనిపిస్తోంది. జగన్ పర్యటన చేసిన జిల్లాల్లో ప్రజల నుంచి వచ్చిన స్పందన ను ఆ తర్వాత దానికనుగుణంగా వారిని కదిలించాలనే శ్రద్ధ వైసీపీలో కనిపించడం లేదు. అందుకు ప్రధాన కారణం దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతల మధ్య పెరుగుతున్న సమన్వయం సమస్యేనని చెబుతున్నారు. చివరకు జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాన్ని కిందిస్థాయి ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా వైసీపీ శ్రేణులు విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది.
గడిచిన ఎన్నికల్లో కూడా అతివిశ్వాసం ఆపార్టీ కొంపు ముంచింది. అయినా తీరు మారుతున్న దాఖలాలు లేవు. ప్రత్యేక హోదా ఉద్యమం విషయంలో చాలాకాలంగా సాగుతున్నప్పటికీ దానిని తనకుగుణంగా మలచుకోవడంలో కూడా కొన్ని నైరాశ్యం కనిపిస్తోంది. అన్ని పార్టీలు ఒకే నినాదంతో సాగుతున్న సమయంలో మరింత జాగ్రత్తలు అవసరం అయినప్పటికీ అందుకు భిన్నంగా ఉంది. దాంతో ఇన్నాళ్ల శ్రమ ఫలితం మరో పార్టీకి మేలు చేసే రీతిలో వెళుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. ఇలాంటి పరిస్థితి మార్చుకోకపోతే పార్టీకి నష్టం తప్పదనే అభిప్రాయం బలపడుతోంది. అతివిశ్వాసంతో వ్యవహరిస్తే అసలుకే ఎసరు తెస్తుందన్న విషయాన్ని వైసీపీ నేతలు గ్రహిస్తే మంచిదనే వారు కనిపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్యాచరణ లేకుండా అధినేత అడుగులతోనే అధికారం దక్కుతుందనే ఆలోచన విరమించుకోవాలన పలువురు సూచిస్తున్నారు.