కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలు తూర్పు గోదావరి జిల్లా రైతాంగాన్ని కుప్ప కూల్చింది. వేలాది ఎకరాల్లో వరి,మామిడి, బొప్పాయి పంటలు పాడయ్యాయి. వరి పంట వారంలో చేతికి వస్తుంది అనుకున్న తరుణంలో ఈదురు గాలుల వాన రైతుల ఆశలపై నీళ్ళు చల్లింది. వరి యంత్రాలు లేక కూలీలు దొరక్క కోతకు సిద్ధంగా ఉన్న లక్ష ఎకరాల్లో వరి తలవాల్చింది. తూర్పుగోదావరి జిల్లాలో పంట న్టం కారణంగా ఓ పక్క రైతులు లబోదిబోమంటుంటే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం అంతాగా నష్టమేమీ లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
కడప జిల్లాలోనూ అకాల వర్షాలు రైంతాంగాన్ని నట్టేటముంచాయి. ముద్దనూరు మండలంలోని ఆరవేటి పల్లెలో అరటి , బొప్పాయి చెట్లు నేల కూలాయి. నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకానికి తీసుకొచ్చిన ధన్యం వర్షంలో తడిచిపోయింది. 20 రోజులుగా అధికారులు ధ్యాన్యం కొనకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బస్తాలు తడిచిముద్దయ్యాయి. తడిచిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగడంతో కలెక్టర్ హరిత రంగంలోకి దిగారు. వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌లో తడిచిన ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలులో అలసత్వం వహించిన అధికారులకు చివాట్లు పెట్టిన హరిత..తడిచిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో రైతులు మార్కెట్ కు తెచ్చిన ధాన్యం గాలివాన ధాటికి నీళ్ళల్లో కొట్టుకపోయింది. నేల పాలైన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడెం మండలంలోని గాలిగూడెం, పద్మారాం, పెద్దఎల్కిచర్లలో వేయి ఎకరాల్లో వరి, మామిడి పండలు దెబ్బతిన్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఐకెపి సెంటర్లలో కాంటాలు పూర్తి కాని ధాన్యపు రాశులు నీటిపాలయ్యాయి.
ఇక ముంబై నుండి గూడ్స్ వ్యాగన్లలో తెచ్చిన వెయ్యి టన్నుల ఆర్సీఎఫ్ యూరియా మిర్యాలగూడలో నీటిపాలైంది. జడ్చర్లకు చేరాల్సిన 26 వందల టన్నుల యూరియా అక్కడ గోడౌన్లలో ఖాళీ లేకపోవడం, హమాలీల కొరత కారణంగా మిర్యాలగూడలో ఉంచారు. దీంతో ప్లాట్ పాంపైనే ఉంచిన వెయ్యి టన్నుల యూరియా బస్తాలు తడిచిపోయాయి.