తెలుగుదేశం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే డిఫెన్స్ లో ఉన్న నేపథ్యంలో చిన్న చిన్న అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకునే దిశలో సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే విజయసాయిరెడ్డి వ్యవహారం మీద దృష్టిపెడుతోంది. తద్వారా ఓ వైపు బీజేపీని మరోవైపు వైసీపీని కార్నర్ చేసే అవకాశం వచ్చిందని ఆశిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి పదే పదే పీఎంని కలుస్తున్నారన్న ప్రచారం ద్వారా అవినీతి విషయంలో మోడీ చిత్తశుద్ధిని, ఏపీని బీజేపీ మోసం చేస్తున్నప్పటికీ ఆపార్టీతో వైసీపీ అంటకాగుతోందనే వాదనను ముందుకు తీసుకొస్తోంది. దాంతో ఒకే దెబ్బకు రెండు పిట్టల మీద గురిపెట్టినట్టు కనిపిస్తోంది.
వాస్తవానికి ఏపీలో ప్రజలు దాదాపుగా బీజేపీ అంటే మండిపడుతున్నారు. ఆపార్టీని దాదాపుగా ఏవగించుకుంటున్నారు. ఏకంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కంటే ఎక్కువ అన్యాయం చేసిందనే అభిప్రాయం పలువురిలో వినిపిస్తోంది. దానిని గ్రహించడంతోనే టీడీపీ కూడా ఎట్టకేలకు ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది. అదే సమయంలో వైసీపీ, బీజేపీ బందం బలపడుతుందని అనుమానిస్తోంది. దానిని ఉపయోగించుకుని బీజేపీతో పాటు వైసీపీని కూడా ప్రజల్లో పలుచన చేయాలని అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి మీద గురిపెట్టి వైసీపీని బద్నాం చేయవచ్చని చూస్తోంది. అదే సమయంలో అవినీతిని కూడా ముందుకు తీసుకురావడం తమకు మేలు చేస్తుందని టీడీపీ ఆశిస్తోంది.
అయితే టీడీపీ తీరుని వైసీపీ విమర్శిస్తోంది. ఏకంగా సుజనా చౌదరి వంటి వారు క్యాబినెట్ లోనే ఉండగా లేనిది విజయసాయిరెడ్డి వంటి ఎంపీ పీఎంవోని కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. సుజనా చౌదరి వ్యవహారంలో కోర్ట్ తీర్పులు మరచిపోకూడదని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి చుట్టూ వివాదం తిప్పడం ద్వారా అవిశ్వాసం, ప్రత్యేక హోదా వంటి విషయాలను నీరుగార్చే ఆలోచనలో టీడీపీ ఉన్నట్టు అర్థమవుతోందని వైసీపీ నేతలు ప్రతివిమర్శలకు దిగుతున్నారు. దాంతో ఇరు పార్టీలు ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ రాజకీయంగా పై చేయి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్టు స్పష్టమవుతోంది.