తమిళనాడు గవర్నర్‌ అనుచిత ప్రవర్తన

Update: 2018-04-18 07:51 GMT

తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. విలేకరుల సమావేశంలో ఓ మహిళా విలేకరి చెంపను తాకి అనుచితంగా ప్రవర్తించారు. దీంతో ఈ ఘటన వివాదాస్పదమైంది. ఉన్నతాధికారుల లైంగిక వాంఛ తీర్చాలంటూ విద్యార్థినులపై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మదురై కామరాజ్‌ విశ్వవిద్యాలయ సహాయ ఆచార్యురాలు నిర్మలాదేవితో సంబంధం ఉన్నట్లు ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఈ ఘటనతో మళ్లీ చిక్కుల్లో పడ్డారు. 

రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన 78ఏళ్ల బన్వారీలాల్‌ తనకు నిర్మలాదేవి ఎవరో తెలియదని వెల్లడించారు. అయితే సమావేశం అయిపోయి వేదిక దిగి కిందకు వెళ్లేటప్పుడు ఓ మహిళా విలేకరి‌ ప్రశ్న అడగగా ఆయన సమాధానం చెప్పకుండా ఆమె చెంపపై తాకడంతో అంతా షాకయ్యారు.

బాధితురాలైన ‘ద వీక్‌’ అనే పత్రికలో పనిచేసే లక్ష్మి సుబ్రమణియన్‌ ఘటన అనంతరం దీనిపై ట్విటర్‌లో స్పందించారు. సమావేశం ముగిసి వెళ్తున్న సమయంలో తాను గవర్నర్‌ను ఓ ప్రశ్న అడిగానని, దీనికి ఆయన సమాధానంగా నా అనుమతి లేకుండా చెంపపై తాకారని, ఇది చాలా అనైతిక ప్రవర్తన అని ఆమె ట్విటర్లో అభిప్రాయపడ్డారు. ఈ ఘటనతో గవర్నర్‌ పురోహిత్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. డీఎంకీ కార్యకర్తలు రాజ్‌భవన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. 

రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ఆయన ఇలా చేయడం సరికాదని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ఆయన ఉద్దేశం ఏదైనా కావొచ్చు కానీ ఓ మహిళ గౌరవానికి భంగం కలగించేలా ఉందని విమర్శించారు. డీఎంకే కార్యనిర్వహక అధ్యక్షుడు ఎం.కె స్టాలిన్‌ కూడా గవర్నర్‌ ప్రవర్తనను తప్పు పడుతూ ట్వీట్‌ చేశారు. 

Similar News