ఎస్సీ ఎస్టీ చట్టం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కేంద్రం నిన్న దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు..తీర్పులో ఎలాంటి మార్పులు ఉండబోవని తేల్చి చెప్పింది. ధర్డ్ పార్టీ పిటిషన్లు దాఖలు చేయడానికి గడువు ఇచ్చింది. తాము ఎస్సీ ఎస్టీ చట్టానికి వ్యతిరేకం కాదని రివ్యూ పిటిషన్‌ను విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అమాయకులు శిక్షంపబడకూడదనే ఉద్దేశంతోనే చట్టం అమలులో సవరణలు చేశామన్న సుప్రీంకోర్టు..తీర్పును సరిగా చదవకపోవడం వల్లే ఆందోళనకారులు నిరసనలకు దిగుతున్నారని అభిప్రాయపడింది.
ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ఇంతకాలం రివ్యూ పిటిషన్ దాఖలు చేయకపోవడాన్ని నిరశిస్తూ..నిన్న దళిత సంఘాల భారత్ బంద్ పాటించాయి. నిన్నటి బంద్ హింసాత్మకంగా మారింది. పలు రాష్ట్రాల్లో ఘర్షణలు జరిగి 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం...హడావిడిగా రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం-1989 లోని ఏ నిబంధనలను సడలించినా రాజ్యాంగంలోని 21వ అధికరణాన్ని ఉల్లంఘించడమేనని కేంద్ర ప్రభుత్వం వాదించింది. ఎస్సీ ఎస్టీ చట్టం అమలులో సవరణలు చేస్తూ గత నెలలో ఇచ్చిన తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు విన్నవించింది.
అయితే గతంలో ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..10 రోజుల తర్వాత కేసును తిరిగి విచారిస్తామని తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న ఆందోళన వెనుక వేరే ప్రయోజనాలున్నట్లు కనిపిస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ప్రజల హక్కుల పరిరక్షణ గురించి తమకు తెలుసని అత్యున్నత న్యాయస్థానం కామెంట్ చేసింది.