నెల్లూరు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో.. నెల రోజులుగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనకు తొలుత నెల్లూరులో చికిత్స చేయించుకున్నారు. మెరుగైన వైద్యాన్ని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అయితే కిమ్స్ వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆనం తుదిశ్వాస విడిచినట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
1950, డిసెంబర్ 25న నెల్లూరులో ఆనం వివేకా జన్మించారు. నెల్లూరు జిల్లాలో రాజకీయనాయకుడిగా ఆనం వివేకా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మున్సిపల్ వైస్‌ఛైర్మన్‌గా, చైర్మన్‌గా అలాగే చైర్మన్ల సంఘం ఏపీ అధ్యక్షుగా ఆయన పనిచేశారు. ఏ పదవిని అలంకరించినా ఆ పదవికే వన్నెతెచ్చిన ఆనం ఇక లేరనే విషయాన్ని నెల్లూరు జిల్లా వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీనిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలు తీరుస్తూ ప్రజల్లో ఒకరిగా కలిసిపోయిన వ్యక్తి ఆనం వివేకా.
ఆనం వివేకా అతి చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అడుగుపెట్టిన ఆనం వివేకా అంచెలంచెలుగా ఎదుగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో ఆనం ఎంతో సన్నిహితంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆయన గత ఎన్నికల అనంతరం సోదరుడు ఆనం రాంనారాయణరెడ్డితో పాటు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంలో చేరారు. ఇటీవల అనారోగ్యంతో ఆనం వివేకా హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, నారాయణ, సోమిరెడ్డి కిమ్స్ ఆసుపత్రికి వచ్చి ఆయనను పరామర్శించారు. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవి కూడా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఆనం మృతి ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులను కలచివేస్తోంది. ఆనంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుబ్బారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. చిన్న కుమారుడు మయూర్ ప్రస్తుతం కార్పొరేటర్‌గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆయన మృతి పట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం ప్రకటించారు. మరికాసేపట్లో ఆనం వివేకా భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఆయన స్వస్థలం నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు. రేపు నెల్లూరులో ఆనం అంత్యక్రియలు జరుగనున్నాయి.