ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉగ్రరూపం దాల్చారు. తన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలను ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఇదంతా ఎందుకోసం అంటే..వారి నోటిని అదుపులో ఉంచుకునేందుకు. ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు మీడియా ముఖంగా అనేక వ్యాఖ్యలు చేయడం, అవి వైరల్ అవ్వడం, వివాదాస్పదంగా మారడం, నేతలు నవ్వులపాలు అవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మోడీ ఘాటు హెచ్చరికలు చేశారు. అనవసర వ్యాఖ్యలు చేసి మీడియాకు మసాలా అందించొద్దని పార్టీ నాయకులకు స్పష్టం చేశారు. నమో యాప్ ద్వారా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న మోడీ మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు.
పార్టీ నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరు నెలలుగా ఉగ్రవాదం, లైంగికదాడులు, మహాభారత్, డార్విన్ సిద్ధాంతం తదితర అంశాలపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. `మనం చేసే పొరపాట్లు మీడియాకు మసాలా అందిస్తాయి. మనవాళ్లు కెమెరా కనిపించగానే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. వాటిని మీడియా వాడుకుంటుంది. ఇది మీడియా తప్పిదం కాదు. దీనివల్ల పార్టీతోపాటు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని గుర్తుంచుకోవాలి. బాధ్యతారాహిత్య వాఖ్యలకు దూరంగా ఉండాలి`` అని హెచ్చరించారు.
గతేడాది ఏప్రిల్‌లో జరిగిన బీజేపీ సదస్సులోనూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయొద్దని మోడీ నేతలను హెచ్చరించారు. ప్రజలతో మమేకం కావడానికి సోషల్ మీడియాను విరివిగా వాడాలని బీజేపీ నేతలను కోరారు. దేశంలో మోడీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేష ప్రసంగాలు మితిమీరుతున్న సంగతి తెలిసిందే. ఎన్డీయే పాలనలో ఇవి 500 శాతం మేర పెరిగినట్టు ఓ మీడియా సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. విద్వేష ప్రసంగాల్లో 90 శాతం ఘటనలకు బీజేపీ నేతలే కారకులు కావడం గమనార్హం.