కర్ణాటకలో ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీలకు..., తిధి, వారాలు, ముహూర్తాలు, వాస్తు దోషాలు టెన్షన్ పెడుతున్నాయా.? కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై నేతలు లోలోపల ఆందోళన చెందుతున్నారా ? ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలకు గ్రహాల అనుకూలతలు లేవా ? పోలింగ్, కౌంటింగ్ తేదీలపై నేతలకు ఎందుకంత భయం పట్టుకుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలకు తిధి, నక్షత్రం, వాస్తు దోషం టెన్షన్ పట్టుకుంది. ఏప్రిల్ 17న నోటిఫికేషన్ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మే 12న పోలింగ్ నిర్వహించి 15న ఫలితాలు ప్రకటించనుంది. 12న శనివారం పోలింగ్, ఓట్ల లెక్కింపు 15న అంటే అమావాస్య రోజున చేపట్టడంపై నేతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తు పట్టింపులు, గ్రహాల అనుకూలతలు లేకుండా తేదీలను ప్రకటించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన రెండు రోజులు మంచి రోజులు కావని దుశ్శకునానికి సూచికలను నేతలు అంటున్నారు.
జ్యోతిశాస్త్రంపై మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడకు అపారమైన నమ్మకముంది. తమ పార్టీ అవకాశాలను దెబ్బ తీసేందుకు జరుగుతున్న కుట్రలను నియంత్రించేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్పకు జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతారు. సీఎంగా పని చేసిన కాలంలో చేతబడికి వ్యతిరేకంగా పూజలు కూడా చేయించారనే ప్రచారం జరిగింది
మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు వాస్తు, గ్రహబలాలపై నమ్మకం లేదు. అయితే సిద్ధరామయ్య భార్య పార్వతి మతపరమైన విషయాల్లో పూర్తిగా నియమ నిష్టలను పాటిస్తారు. భర్త, కుమారుడు విజయం సాధించాలంటూ ఇప్పటికే పూజలను ప్రారంభించారు. నాగా సాధువుల పాదాలను తాకితే...రాజకీయంగా తిరుగుండదని స్థానికులు భావిస్తారు. దీంతో బీజేపీ నేత యడ్యూరప్ప...నాగా సాధవులను ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వాదం పొందారు. ఆలయాల జెండాలను వేలంలో కొనుగోలు చేస్తే...తమకు తిరుగుండదన్న నమ్మకంతో ఓ రాజకీయ నేత జెండాలను కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.