జనసేన పార్టీ తరుపున పోరాటం చేసిన కల్యాణ్ దిలీప్ సుంకర ఆ పార్టీపై సంచలనమైన ఆరోపణలు చేశారు. పార్టీని స్థాపించిన నాటి నుండి పవన్ కల్యాణ్ వన్ మ్యాన్ షో గా ముందుండి నడిపిస్తున్నారు. ఏ కార్యక్రమమైనా జనసేన తరుపున పవన్ ఒక్కరే పాల్గొనేవారు. మిగిలిన వారిని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. గతంలో అన్నయ్య స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో ఉన్నవారందరికి సముచిత స్థానం కల్పిస్తే చిరంజీవికి వెన్నుపోటు పొడిచారని, కానీ తానుమాత్రం అలా చేయనని కాబట్టే బహిరంగసభల్లో నేను ఒక్కడినే మాట్లాడుతున్నట్లు పవన్ చెప్పిన విషయం తెలిసిందే.
అయితే కల్యాణ్ దిలీప్ సుంకర జనసేన పార్టీ కార్యకర్తగా చెలామణీ అవుతూ టీవీ ఛానల్ డిబేట్ల లో ప్రత్యర్ధులు పార్టీ పై చేసే విమర్శల్ని తిప్పికొడుతున్నారు. ఒకరకంగా జనసేన వాదనను పవన్ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో వినిపించింది దిలీపే. కానీ ఇప్పుడా దిలీప్ ను పార్టీ నుంచి గెంటేసే పరిస్థితి? వచ్చింది.
నిన్నమొన్నటివరకు జనసేన జెండా మొసిన దిలీప్ పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలు, కుట్రల్ని సహించలేకనే తాను బయటకు వెళుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ఆత్మాభిమానాన్ని చంపుకునే వ్యక్తిని కాదంటూ మండిపడ్డారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతుంటే తనకు అవమానం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. డిబెట్లలో తానే స్వయంగా పాల్గొనలేదని, టీవీఛానళ్ల ఆహ్వానం మేరకు తాను పాల్గొన్నట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు 93 డిబెట్లలో పాల్గొన్నా .. పదేపదే పార్టీతో కల్యాణ్ దిలీప్ సుంకరకు సంబంధం లేదన్న స్టేట్‌మెంట్స్ ఇవ్వడం బాధించిందన్నారు.
పార్టీ తరుపున తాను డిబెట్లలో పాల్గొంటే జనసేనలోనొ కొంతమంది వ్యక్తులు టీవీ ఛానళ్లకు ఫోన్ చేసి మరీ.. కల్యాణ్ ను డిబేట్లకు పిలవొద్దు అంటూ కొంతమంది చెబుతున్నారని కల్యాణ్ అన్నారు. 'మేము పెట్టిన మహాద్భుతమైన ప్యానెల్ ఉండగా.. కల్యాణ్ ఎవడండి?' అన్న రీతిలో వారు వ్యవహరిస్తున్నారన్నారు. ఇన్నాళ్లుగా పవన్ తో ఒక్కఫోటోదిగుదామని ప్రయత్నించినా కనీసం పార్టీ ఆఫీస్ లోకి రానివ్వలేదని ఆరోపించారు. జనసేనకి - కల్యాణ్ దిలీప్ సుంకరకు సంబంధం లేదని వాళ్లు వీళ్లు చెప్పడం కాదు . దమ్ముంటే ఆ మాట పవన్ కల్యాణ్ ని చెప్పమనండి అని సవాల్ విసిరారు.
తాను జనసేన తరుపున డిబెట్లలో పాల్గొంటే పార్టీలోని కొంతమంది వ్యక్తుల లుచ్చా రాజకీయాలను ఇక సహించలేనని, ఆ రాజకీయాలు పవన్ కు నచ్చుతాయేమో కానీ తనకు కాదని స్పష్టం చేశారు. బోకు రాజకీయాలు చేస్తూ వెన్నుపోటు పొడిచే వెధవల్లారా? అంటూ కల్యాణ్ తీవ్ర స్థాయిలో వారిపై మండిపడ్డారు.
ఇక జనసేన నుంచి తప్పించాలనే ఉద్దేశంతో తనపై లేనిపోని కుట్రలు చేస్తున్నారని అన్నారు. పవన్ - కత్తిమహేష్ వివాదంలో తన హస్తం ఉందని ప్రచారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ పై కత్తిమహేష్ ను ఉసిగొల్పానని ... చివరకు కథను సుఖాంతం చేసి క్రెడిట్ కొట్టేశాడని కొంతమంది తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కల్యాణ్ అన్నారు. పార్టీ మంచి కోసమే తాను మహేష్ కత్తితో రాజీ ప్రయత్నాలను కుదిర్చాను తప్ప.. అందులో ఏ స్వార్థమూ లేదన్నారు. జనసేన తనను దూరం పెట్టినంత మాత్రానా తనకేమి నష్టం లేదని, గంతకు తగ్గ బొంత లాగా మరో పార్టీలోకి వెళ్లి కష్టపడి పనిచేసి నిరూపించుకునే సత్తా తనకు ఉందని కల్యాణ్ స్పష్టం చేశారు.