బీజేపీ ఏపీ అధ్యక్ష పదవికి కంభంపాటి హరిబాబు రాజీనామా చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు నిన్ననే రాజీనామా లేఖ పంపించినట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడంలేదు.
ఏపీ అధ్యక్షుడిగా హరిబాబు పదవీకాలాన్ని బీజేపీ అధిష్ఠానం ఓసారి పొడిగించింది. కొత్త అధ్యక్షుడిని నియమించే వరకు హరిబాబునే కొనసాగించాలని ముందే నిర్ణయించారు. అయితే, ఏపీ అధ్యక్ష పదవికి హరిబాబు ఆకస్మికంగా రాజీనామా చేయడం కొత్త చర్చకు తావిస్తోంది.
రాష్ట్ర బీజేపీలో ఒకవర్గం మొదటి నుంచి టీడీపీ సర్కారుపై ధ్వజమెత్తుతుండగా హరిబాబు సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఆయన స్థానంలో మరొకరిని పారీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక దశలో గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడు పార్టీ కోరినందునే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారా? లేక తనంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.