ఉత్తరాంధ్రపై దృష్టిసారించింది ప్రతిపక్ష పార్టీ. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను రుజువు చేస్తూ.. పార్టీలో భారీ చేరికలపై స్కెచ్ వేస్తోంది. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఉత్తరాంధ్రలో పావులు కదుపుతున్న వైసీపీ.. కనీసం ఆరు ఎంపీ స్థానాలు దక్కించుకోవాలని చూస్తోంది. దీనికోసం ఆ ప్రాంత నేతలతో ఓ కమిటీ కూడా ఏర్పాటైంది. మరి గెలుపు గుర్రాల కోసం ఆ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ చేస్తున్న ప్రయత్నాలేంటి? ఆ పార్టీ నేతల వ్యూహాలేంటి? వాచ్ దిస్ స్టోరీ.
2014 ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తోంది ప్రతిపక్ష పార్టీ. ఉత్తరాంధ్రలో తమకు పెద్దగా పట్టులేని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి తమ వర్గాన్ని పెంచుకునే పనిలో పడింది. 2019 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి కనీసం 6 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలని చూస్తోంది. దీంతో గెలుపు గుర్రాల వేటలో పడ్డారు ఆ పార్టీ నేతలు.
విశాఖలో గత ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన వై.ఎస్.విజయమ్మ పరాజయం కావడంతో ఆ సీన్ రిపీట్ కాకుండా ఉండేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం టార్గెట్ ఉత్తరాంధ్ర పేరుతో పార్టీలోకి భారీగా చేరికలను ప్రోత్సహిస్తోంది. ఈ మూడు జిల్లాల్లో బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతలను సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, విజయసాయిరెడ్డిలకు పార్టీ అధినేత జగన్ అప్పగించారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రలో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
మొత్తంమీద ఉత్తరాంధ్రలో వచ్చే ఎన్నికల్లో ఆరు ఎంపీ స్థానాలు, 20 అసెంబ్లీ స్థానాలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది వైసీపీ. మరి ఆ పార్టీ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.