జాగ్రత్తగా ఉండండి.. లేకుంటే అసలుకే ముప్పు!

Update: 2018-05-01 11:19 GMT

రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. ఇవాళ వచ్చిన మే నెలకు ముందే.. 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జాగ్రత్తగా లేకుంటే.. ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో 50 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా దాటేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇప్పటికే.. వడదెబ్బ కారణంగా.. చాలా మంది ప్రాణాలు వదులుతున్నారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి అని డాక్టర్లు కూడా జనానికి అవగాహన పెంచుతున్నారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ వీలైనంతవరకూ ఎక్కువగా పనులు పెట్టుకోకండి.

తప్పనిసరి అయితేనే ఎండల్లో బయటికి వెళ్లండి. వెళ్తే.. తలకు బట్ట కట్టుకోవడం, వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకోవడం తప్పనిసరి.

ఎండలో వెళ్లాల్సి వచ్చినపుడు.. ఏమైనా బేజారైతే వెంటనే జాగ్రత్త పడండి. చల్లని నీళ్లతో మొహం కడుక్కోవడం.. నీడ పట్టున కనీసం పది పదిహేను నిమిషాలు విశ్రాంతి తీసుకోవడం లాంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వండి.

ఎండాకాలం సాధ్యమైనంతవరకూ.. దగ్గర ఓఆర్ఎస్ ద్రావణాలు ఉండేలా చూసుకోవాలి. ప్రయాణాల సమయాల్లో.. డీ హైడ్రేషన్ లాంటివి రాకుండా ఇవి ఉపయోగపడతాయి.

ఎప్పుడైనా వడ దెబ్బ కొట్టినపుడు అనిపిస్తే.. లేదా.. మీరు రోడ్డుపై ఉన్నపుడు ఇతరులు ఈ సమస్యబారిన పడితే.. వారికి వెంటనే సపర్యలు చేయండి. బాధితులు ఎవరైనా.. వెంటనే డాక్టర్ ను సంప్రదించేందుకు ప్రాధాన్యం ఇవ్వండి.

ఎండలతో అనారోగ్యం బారిన పడితే.. నిర్లక్షం మంచిది కాదు. ఫస్ట్ ఎయిడ్ చర్యలను స్వయంగా అయినా.. తోటివారి సాయంతో అయినా చేసుకుని.. వెంటనే డాక్టర్ ను కలిసి.. మందులు వాడేందుకు ఏ మాత్రం వెనకాడకండి.

ఎండల్లో ప్రయాణించాల్సి వస్తే.. చలివేంద్రాల దగ్గర ఆగి.. కాసేపు మొహం కడుక్కుని వెళ్లండి. అవి అందుబాటులో లేవు అనుకుంటే.. మీ దగ్గర వాటర్ బాటిళ్లు అయినా వాడి.. ఎప్పటికప్పుడు ఎండ నుంచి ఉపశమనం పొందుతూ ఉండండి.

ఈ జాగ్రత్తలు.. మీరు పాటించడం మాత్రమే కాదు.. మీ తోటివారు కూడా పాటించేలా చూడండి.

ముఖ్యంగా.. వృద్ధులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. వారిని ఎండల్లో బయటికి పంపకపోవడమే ఉత్తమం.

Similar News