బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు. కొంతకాలంగా అసమ్మతి స్వరం వినిపిస్తున్న ఆయన... బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ చేరబోననీ.. అయినప్పటికీ ప్రజాస్వామ్యం కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇవాళ పాట్నాలో ప్రతిపక్షాలతో కలిసి నిర్వహించిన ఓ కార్యక్రమంలో యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ...ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రిపోర్టర్లను హత్యలు చేయిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని, బీజేపీతో ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నానని అన్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, సమాజ్ వాదీ , తృణమూల్ కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. కాగా, 2002-04 మధ్య కాలంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎక్స్ టర్నల్ అఫైర్స్ శాఖా మంత్రిగా, 1998-2002 లో ఫైనాన్స్ మినిస్టర్ గా యశ్వంత్ సిన్హా పని చేశారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ కేబినెట్ లో యశ్వంత్ సిన్హా కుమారుడు జయంత్ సిన్హా మంత్రిగా ఉన్నారు. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రిగా జయంత్ సిన్హా పనిచేస్తున్నారు.